100 ఏళ్లలో ఎన్నడూ లేని ఎప్పుడూ చూడనిది.. హైదరాబాద్ వరదలతో అల్లాడిపోతోంది. భాగ్యనగరం మొత్తం భారీ వర్షాలతో అల్లాడుతోంది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వరద భీభత్సం హైదరాబాద్‌ని కమ్మేసింది. భారీ వర్షాలకు చెరువులకు గండ్లు పడుతున్నాయి, కాలనీలు వరద నీళ్లలో మునిగిపోయాయి. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అన్ని రకాల జాతులు, కులం మతం అన్న తేడా లేకుండా అన్ని భాషల వారు మిళితమైన విశ్వ నగరం నేడు భారీ వర్షాలకు, వరదలకు అలో లక్ష్మణా.. అంటుంది. తినడానికి తిండిలేదు.. ఇల్లు దాటి బయటికి రావాలంటే నీళ్లలో కొట్టుకుపోతామేమో అనే భయం హైదరాబాద్ వాసులను కమ్మేసింది. ఐటి కంపెనీలు, మల్టి స్పెషాలిటీ హాస్పిటల్స్, పలు స్టూడియోస్, అనేక రకాల కంపెనీలు ఉన్న హైదరాబాద్ నేడు నీళ్లలో తేలుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ వరదల నుండి హైదరాబాద్ ని రక్షించడానికి కంకణం కట్టుకున్నప్పటికీ.. వర్షాలు అడ్డు పడుతున్నాయి.
అయితే హైదరాబాద్ నగరం వరదలతో భీభత్సం అవడంతో టాలీవుడ్ స్టార్స్ తమవంతు సహాయం చేయడానికి పెద్ద మనసు చేసుకుని ముందుకొచ్చారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 1 కోటి 50 లక్షలు.. మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ మహేష్ తలా ఒక కోటి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం ప్రకటించగా నాగార్జున, ఎన్టీఆర్.. తలా 50 లక్షలు ప్రకటించారు. యంగ్ హీరో రామ్ 25 లక్షలు, మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ 10 లక్షలు, దర్శకుడు త్రివిక్రమ్ 10 లక్షలు, నిర్మాత ఎస్. రాధాకృష్ణ 10 లక్షలు, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బండ్ల గణేష్ తలా 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ప్రకటించారు. ఎప్పుడు కష్టం వచ్చినా.. ఆదుకోవడానికి మేము రీల్ హీరోలమే కాదు.. రియల్‌గా కూడా హీరోలమే అనేలా నిరూపించుకుంటున్న వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.