టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అటు రాజకీయాల్లో.. ఇటు సినిమాల్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ అయ్యారు కానీ సినిమాల్లో మాత్రం ఇప్పటికీ పవన్‌ను ఢీకొట్టే హీరో ఇంతవరకూ రాలేదంటే.. అప్పటికీ ఇప్పటికీ ఆయన ‘పవర్’ తగ్గలేదనే చెప్పాలి. అందుకే ఆయన ఎప్పుడొప్పుడు రీ ఎంట్రీ ఇస్తారా అని దర్శకులు, నిర్మాతలు అంతకుమించి అభిమానులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ‘వకీల్ సాబ్’ మూవీతో పవన్ తన పవర్‌ను చూపించడానికి వచ్చేశాడు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్-5లో భాగంగా సినిమా షూటింగ్స్, రిలీజ్‌లకు కూడా అనుమతి రావడంతో త్వరలోనే షూటింగ్ షురూ చేసేందుకు ‘వకీల్‌సాబ్’ చిత్రబృందం సిద్ధమవుతోంది.
కాగా.. ఈ సినిమాతో పాటు పవన్ ‘అయ్యప్పన్ కోషియమ్’ అనే రీమేక్‌లో కూడా నటిస్తున్నట్లు గత కొన్నాళ్లుగా ప్రచారం జోరుగానే జరుగుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి చాలా గాసిప్స్ రాగా.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో, పలు వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ రీమేక్‌కు పవన్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీగా అనడం కంటే దిమ్మదిరిగే రెమ్యునరేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ వార్త చూసిన అభిమానులు, జనసేన కార్యకర్తలు, సినీ ప్రియులు ఔనా అంటూ ఆశ్చర్యపోతున్నారట.
వాస్తవానికి.. పవన్ రాజకీయాల్లోకి వెళ్లకముందు ఏ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకునే వారు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడున్న కరోనా కష్టాల్లోనూ అంతకుమించి రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా ముందుకొచ్చారట. ఈ రీమేక్‌కు గాను మొత్తం 35 నుంచి 45 రోజుల వరకూ షూటింగ్‌కు కాల్షీట్స్ ఇచ్చారని టాక్. ఇందుకుగాను రూ. 50 కోట్లకు పైగానే పవన్ పుచ్చుకున్నారని వినికిడి. అంటే రోజుకో ఎంతో లెక్కేసుకోండి.. కాస్త అటు ఇటు కోటిన్నర అన్న మాట. ఇదే నిజమైతే పవన్‌ను మించిన హీరో మరొకరు లేరనే చెప్పుకోవాలి. ఇది నిజంగానే పవన్ టేకాప్ చేశాడా లేదా అన్నదానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ ‘పవర్’ ఏంటో చూడండి అంటూ తెగ చెప్పుకుంటున్నారు. సో.. ఇదే నిజమైతే మాత్రం పారితోషికంలో పవన్‌ను ఎవరూ బీట్ చేసేంత రేంజ్ ఉండదేమో..!