టాలీవుడ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్‌కు ఇక మంచిరోజులొచ్చినట్లేనా.. ఓ మెట్టెక్కినట్లేనా? సీనియర్ నటి, టాప్ హీరోయిన్ అనుష్క, మాధవన్ జంటగా నటించిన ‘నిశ్శబ్దం’ మూవీతో సుడి తిరిగిందా..? ఈ సినిమాతో ఇదివరకున్న పాతగాయాలన్నీ మానిపోయినట్లేనా..? అంటే అవుననే చెప్పాలి. వాస్తవానికి ఈయన దర్శకుడిగా, రైటర్‌గా చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. ఈయనకు ఇవేమీ పెద్దగా హిట్ కాకపోవడంతో గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఈ నెలలో రిలీజ్ అయిన ‘నిశ్శబ్దం’ చిత్రం మాత్రం హేమంత్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.. ఒక్క మాటలో చెప్పాలంటే మధుకర్ ఓ మెట్టు ఎక్కినట్టేనని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో కాకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యుంటే మరింత హిట్ అయ్యేది. సినిమా తెరకెక్కించిన హేమంత్‌కు మంచిపేరు.. నిర్మాతకు ఇంకాస్త ఎక్కువగా డబ్బులొచ్చేవి. రిలీజ్ రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత వ్యూవర్స్ బాగానే ఈ చిత్రాన్ని వీక్షించారని అనుకున్నదానికంటే ఎక్కువగానే డబ్బులొచ్చాయని తెలుస్తోంది.
చాలా రోజులు తర్వాత ఈ సినిమా చూసిన అనుష్క అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపించినప్పటికీ మొత్తం సినిమాను మాత్రం ట్విస్ట్‌లతోనే డైరెక్టర్ లాక్కొచ్చారు. కాగా.. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్‌కు ఈ కథ చెప్పి ఒప్పించడం మామూలు విషయమేమీ కాదు. వాస్తవానికి ఇప్పుడున్న ట్రెండ్‌లో అనుష్క నటించిన పాత్రలో నటించడానికి దాదాపు ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోకుండా సింపుల్‌గా తిరస్కరించేస్తారు. బహుశా అనుష్క కూడా ఒకట్రెండు సార్లు ఇలా అనే ఉండొచ్చు.. కానీ ఆమెను ఒప్పించడం పెద్ద సాహసమే మరి. మరోవైపు మాధవన్‌ను ఇలాంటి సింపుల్ పాత్రకు ఒప్పించేశారు. వీరితో పాటు హీరోయిన్లు అయినటువంటి అంజలి, షాలిని పాండేలను ఒప్పించి వారికి తగ్గ పాత్రలే ఇచ్చారు. ఆ ఇద్దరూ కూడా వారికిచ్చిన పాత్రలకు వందకు వందశాతం న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంజలి మాత్రం మంచి పాత్రనే ఎంచుకుంది.. ఈ పాత్రతో మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్ సన్‌కు కూడా మంచి పాత్రే ఇచ్చి.. మరోసారి టాలీవుడ్ సినిమా అంటే నటించడానికి నేను రెడీ అనేలా దర్శకుడు చేశారు. ఇలా పాత్రధారుల్లో.. నా పాత్ర ఇంతేనా.. ఇంత చిన్న పాత్రకే చేయాలా..? ఇలాంటి అసంతృప్తులు అనేవి లేకుండా అందరికీ దర్శకుడు తగు న్యాయం చేశారు. ఇలా అందరి కలయికలో నిశ్శబ్దంగా వచ్చిన హేమంత్ ‘నిశ్శబ్దం’గానే హిట్ అయ్యిందని చెప్పుకోవాలి. ఇక సినిమాకు టెక్నికల్ టీమ్ మంచి సపోర్టు ఇచ్చింది. సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రాణంగా నిలిచాయి. మరీ ముఖ్యంగా అమెరికాలో ఫస్ట్ టైమ్ పూర్తి చిత్రం చేయడం అభినందించదగ్గ విషయమే.
ఇకపై చేసే సినిమాలు కూడా మంచి కథలతో తెరకెక్కిస్తే సక్సెస్‌ఫుల్ బాటలో హేమంత్ ఉంటారని నెటిజన్లు సలహాలిస్తున్నారు. స్ట్రీమింగ్ సంస్థ అయిన ‘అమెజాన్’ వారు కూడా ఈ చిత్రాన్ని మొదట వీక్షించి కొంత మంది అమెజాన్ సభ్యులు.. డైరెక్టర్ హేమంత్‌తో పాటు చిత్ర యూనిట్‌ను అభినందించడం మంచి విషయమే. ‘వస్తాడు నా రాజు’ సినిమాను తెరకెక్కించిన మధుకర్ టాలీవుడ్ ప్రియులకు అంతగా దగ్గరకాలేకపోయినప్పటికీ ‘నిశ్శబ్దం’ చిత్రంతో మాత్రం అందరికీ చేరవయ్యారు.. అందరి నోళ్లలో నానుతున్నారు కూడా. కాగా.. హేమంత్ దగ్గర ప్రస్తుతానికి ఇంకో రెండు కథలు ఉన్నాయి. అవి కూడా మంచి దమ్మున్న కథలే అయితే ఇక ఈయనకు తిరుగుండదేమో. ఇదే పంథాలో సినిమాలు తెరకెక్కిస్తూ పోతే ఇప్పుడు స్టార్ హీరోయిన్.. రేపొద్దున స్టార్ హీరోతో డైరెక్షన్ చేసే స్థాయికి చేరుకోవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదేమో. మరి ‘నిశ్శబ్దం’ వచ్చిన మంచి ఫేమ్, నేమ్‌ను మధుకర్ తన తదుపరి కథలతో ఏ మాత్రం నిలుపుకుంటారో వేచి చూడాలి.