కరోనా వచ్చి థియేటర్లన్నింటినీ మూసివేసింది. అప్పటి వరకూ సజావుగా సాగుతున్న జీవితాలన్నింటినీ పూర్తిగా మార్చివేసింది. థియేటర్లు మూతబడిపోవడంతో ప్రత్యామ్నాయాలైన ఓటీటీ వైపు నిర్మాతల చూపు మళ్ళింది. ఎంతకస్తే అంతకు అన్నట్టు సినిమాలు అమ్ముకుంటూ వెళ్ళారు. ఇటు ఓటీటీలు సైతం డైరెక్టుగా సినిమాలని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. ఐతే ఏ ఫ్లాట్ ఫామ్ అయినా సినిమా బాగుంటేనే చూస్తారు.
ఏది పడితే అది రిలీజ్ చేసుకుంటూ వెళ్తే అటు వైపు చూడడానికి కూడా ప్రేక్షకుడు భయపడిపోతాడు. ఓటీటీలో రిలీజ్ అయిన చాలా సినిమాలకి సరైన రెస్పాన్స్ రాలేదు. కారణమేంటో తెలియదు గానీ ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ సినిమాలు అంతగా ఆడలేదనే చెప్పాలి. ఐతే ప్రస్తుతం ఓటీటీల్లో మరో కొత్త కోణం రాబోతుంది. కొత్తగా రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలకి సబ్ స్క్రిప్షన్ తో పాటు పేమెంట్ కూడా ఉంటుందట. పే పర్ వ్యూ అన్నమాట.
కరోనా కాలంలో ఓటీటీలకి డిమాండ్ పెరిగిన మాట నిజమే. కానీ సబ్ స్క్రిప్షన్ తో పాటు సినిమా చూడడానికి కూడా డబ్బులు కట్టడం అనేది మరీ అతిగా అనిపిస్తుంది. అదీగాక ప్రస్తుతం థియేటర్లు కూడా ఓపెన్ కాబోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పే పర్ వ్యూ పద్దతి ఏ మేరకు పనిచేస్తుందనేది సందేహమే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటరు అనే చిత్రం పే పర్ వ్యూ పద్దతిలో జీ5 లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. రెగ్యులర్ చిత్రాలకే రెస్పాన్స్ కరువైపోతున్న ప్రస్తుత సమయంలో పే పర్ వ్యూ పద్దతిలో సినిమాలు ఏ మేర అలరిస్తాయో చూడాలి.