అన్ లాక్ 5.0లో భాగంగా థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15వ తేదీ నుండి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. కాకపోతే ఫుల్ సీటింగ్ సామర్థ్యం కాకుండా సగం సీటింగ్ కి మాత్రమే అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆరున్నర నెలల తర్వాత థియేటర్లలో బొమ్మ పడనుంది. ఐతే లాక్డౌన్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయ్యే మొదటి సినిమా ఏదై ఉంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆ ఎదురుచూపులకి రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పాడు. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, లాక్డౌన్ లో చిత్రీకరించిన కరోనా వైరస్ చిత్రాన్ని రిలీజ్ చేస్తాడట. లాక్డౌన్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయ్యే మొదటి సినిమా ఇదేనంటూ ఆర్జీవీ ప్రకటించాడు కూడా. శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో, వంశీ చాగంటి కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా, కరోనా వైరస్ వల్ల కుటుంబాల్లో కలిగిన భయాలని చూపించబోతుంది.
రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు జనాలని ఆందోళన పరుస్తుంటే థియేటర్లకి ప్రేక్షకులు వస్తారా అన్నది సందేహంగా మారింది. మరి అక్టోబర్ 15వ తేదీన ఏం జరగనుందో చూడాలి.