నేచురల్ స్టార్ నాని కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాలన్నింటిలో పిలా జమీందార్ కూడా ఒకటి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నాని కెరీర్లో మంచి హిట్ గా నిలిచింది. పిల్ల జమీందార్ తర్వాత అశోక్ తీసిన సుకుమారుడు, చిత్రాంగద చిత్రాలు సరైన విజయాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో భాగమతి అనే సినిమా తెరకెక్కించాడు. 2018లో రిలీజైన భాగమతి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దాంతో బాలీవుడ్ నిర్మాతలు భాగమతి సినిమాని హిందీలో తెరకెక్కించడానికి రీమేక్ హక్కులని తీసుకొన్నారు. భూమి ఫడ్నేకర్ హీరోయిన్ గా ఒరిజినల్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో దుర్గావతి షూటింగ్ మొదలైంది. కరోనా కారణంగా చిత్రీకరణకి బ్రేక్ పడింది. ఐతే తాజాగా ఈ చిత్ర షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ అయ్యింది. మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంటుందట.
ఇంకా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఓటీటీ నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయట. అమెజాన్ ప్రైమ్ వీడియో దుర్గావతి చిత్రానికి భారీ ఆఫర్ ఇచ్చినట్లు, అందుకు చిత్ర నిర్మాతలు ఒప్పుకున్నట్లు వినిపిస్తుంది. ఐతే భాగమతి లాంటి సినిమాని థియేటర్లలో చూస్తేనే మజా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి చిత్ర నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో..!