‘‘బాల సుబ్రహ్మణ్యంగారు ఇక మన మధ్య లేరు అన్న నిజాన్ని, చేదు నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి అందరిలాగే కోలుకుని వచ్చేస్తారు, మన మధ్యకి వచ్చేస్తారు, మళ్ళీ ఆయన వైభవం మనం చూస్తాము అంటూ ఎంతో ఆశగా ఎదురు చూసిన నాకు ఈ రోజున ఆయన ఇక లేరు, శాశ్వతంగా దూరం అయ్యారు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. గుండె తరుక్కుపోతుంది. చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతగా అంటే నా సొంత మనిషి, నా కుటుంబ సభ్యుడ్ని, నా అన్నయ్యని పోగొట్టుకున్నంత భాధగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అనుబంధం సినిమా పరంగానే కాదు.. కుటుంబ పరంగా కూడా మా మధ్య అనుబంధం ఉంది. మద్రాస్‌లో ఉన్న రోజుల్లో నుంచి పక్క పక్క వీధుల్లో ఉంటుండే వాళ్ళం. అడపా దడపా కలుసుకుంటూ, కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళం. నేను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే వాడ్ని.. నన్ను తమ్ముడు అంటూ ఆయన కూడా ఎంతో ప్రేమ చూపించే వాళ్ళు. అలాంటి అన్నయ్య ఈ రోజు మన మధ్యన లేరు అనేది నాకు చాలా చాలా భాధగా ఉంది.. గుండె బరువెక్కిపోతుంది.
నిన్న మొన్నటి వరకు కూడాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మా చెల్లెళ్ళ లాంటి శైలజ, వసంతల తోటి మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అన్నయ్య కోలుకుంటున్నారండి, ఫిజియోథెరపీ చేస్తున్నారు. రాసి చూపిస్తున్నారు, త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపొమ్మంటున్నారు, అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. వచ్చేస్తారమ్మా అంటే.. మీరందరు ప్రేయర్ చేస్తున్నారు కదండీ, మీ ప్రార్ధన ఫలితంగా వచ్చేస్తారండి అంటూ వాళ్ళు కూడా ఒక ఆశని వ్యక్తం చేసారు. ఆ రకంగా అనుకుంటున్న నాకు ఈ రోజున ఇది జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోతారు బాలుగారు అని మాత్రం నేను అనుకోలేదు.
ఆయన నా సక్సెస్ వెనకాల ఆయన ఉన్నారనే నేను ప్రధానంగా నమ్ముతుంటాను. ఎందుకంటే సాంగ్స్ విషయాల్లో ఆయన కంట్రిబ్యూషన్ అంతా ఇంతా కాదు.. నా సక్సెస్‌కి ప్రధానమైన కారణం సాంగ్స్. ఆ సాంగ్స్ అంత బాగా రావడానికి కారణం బాలుగారనే నేను నమ్ముతాను. అలాంటి బాలుగారు నా విజయం వెనకాల, నా సక్సెస్, నా అభివృద్ధి వెనకాల, నా ప్రజాదరణ వెనకాల ఆయన ఉత్సాహం, ఆయన ప్రోత్సాహం, ఆయన ఉన్నారనే నేను ప్రగాఢంగా నమ్ముతాను. అందుకే ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటాననే అనుకుంటాను. 80, 90 దశకాల్లో ఆయన ఇచ్చినటువంటి సూపర్ హిట్స్ అంత ఇంత కాదు.. అలాంటి సూపర్ డూపర్ హిట్స్ నాకిచ్చి నా కెరీర్ పరంగా, నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి అన్నయ్య బాలుగారిని నేను జీవితాంతం మర్చిపోలేను. ఎప్పుడు ఆయనకి రుణపడే ఉంటాను. నేను వెరీ బిగినింగ్ అంటే నేను 35, 40 ఏళ్ల నాటి మాట ఆయన్ని ఎంతో చనువుగా అన్నయ్య నువ్వు నువ్వు ఏంటి అలా అనేవాణ్ణి, తర్వాత తర్వాత ఆయన గొప్పతనం, ఆయన ప్రతిభ తెలిసిన తర్వాత ఆయన్ని ఏకవచనంతోటి ఆయన్ని మాట్లాడటం మానుకున్నాను. ఎంతో గౌరవంతోటి మీరు అని సంబోధించేవాడ్ని. దానికి ఆయన చాలా ఇదిగా ఫీలయ్యి ఏంటయ్యా అన్నయ్య అని ఆప్యాయంగా పలకరించే నువ్వు.. మీరు మీరు అని దూరం చేస్తావేంటి అంటూ నన్ను ఒక చనువుగా మందలించేవారు. అంతటి ఆప్యాయత, ప్రేమ ఉండేది మా మధ్య. అలాంటి అన్నయ్య దూరం అయ్యారు. చాలా భాధగా అనిపిస్తుంది.
ఘంటశాలగారు పోయిన రోజుల్లో ఆ స్థానం మళ్ళీ ఎవరు భర్తీ చేస్తారు అని అందరూ అనుకుంటున్న సమయంలో బాలు వచ్చి ఆయన్ని చాలా త్వరగా మరిపింప చేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. మళ్ళీ తన ప్రతిభని చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బాలుగారి నిష్క్రమణ తరువాత ఈ స్థానం ఇంకెవరు భర్తీ చేస్తారు. ఈ స్థానం మళ్ళీ ఎవరు పూరిస్తారంటే సమాధానం లేదు. అది ఇంకెవరు లేరు. ఇంకెవరు భర్తీ చేయలేరు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఒకే ఒకరి వల్ల అవుతుంది. అది బాలు వల్లే. ఆయనే మళ్ళీ జన్మించాలి. ఆయన పునర్జన్మిస్తేనే బాలు స్థానం ఎవరైనా సరే మళ్ళీ భర్తీ చేయగలరు. అలాంటి లెజెండ్రీ పర్సన్ ఆయన.. ఆయనొక గొప్ప వ్యక్తి.. ఆయనొక నిష్ణాతుడు ఆయన. ఆయన తెలుగులోనే కాదు, తెలుగు సంగీతంలోనే కాదు.. ఏ భాషలోనైనా సరే ఆయన వాళ్ళకి అంత ఆప్యాయత, అంత ఆత్మీయుడు అని అనిపించుకునేలాగా ఆయన ప్రతిభ ఉండేది.. అంటే బహుశా ఆయన ఆయా భాషల్ని అంత గౌరవించే వాళ్ళు, అలాగే మన తెలుగు భాషనీ అంతగా ప్రేమించే వాళ్ళు.
సుందర తెలుగు అని ఇతర భాషా కవులు మన తెలుగు భాషని పొగిడే వాళ్ళు. తెలుగు చాలా తియ్యగా ఉంటుందని మరికొంత మంది కవులు అంటుండేవాళ్లు. కానీ ఈ తియ్యదనం, ఈ సుందరం, ఈ అందం అనేది నాకెక్కడ తెలుగులో ఎలాగా కనిపించేది కాదు. అది ఒక్క బాలుగారి వాయిస్ నుంచి, ఆయన కంఠం నుంచి, ఆయన గళం నుంచి వెలువడినప్పుడే తెలుగు ఇంత తియ్యగా ఉంటుందా.. ఇంత సుందరంగా ఉంటుందా అని నాకు అనిపిస్తూ ఉండేది. అంత అందంగా ఉండేది. ఆయన తెలుగుని అంత బాగా అభిమానిస్తారు కాబట్టే, ఇతర భాషల గాయకులు వచ్చి ఒక రకంగా ఇబ్బందిగా వాళ్ళు పాడుతుంటే ఈయన గిల గిల్లాడిపోయేవాళ్లు. అయ్యా తెలుగుని కూని చేయకండయ్యా.. తెలుగు చాలా అందమైన భాష, మీకు వాయిస్ వెరైటీగా ఉండాలని ప్రయత్నం చేయొచ్చు కానీ, తెలుగుని కూని చేసే ప్రయత్నం చేయకండి. తెలుగు భాష అంటే అంత అభిమానం ఆయనకి.
అలాగే ఇక నా విషయానికి వస్తే కనుక ఏవయ్యా నువ్వు కమర్షియల్ చట్టంలో పడిపోయి నీలోని నటుడ్ని దూరం చేసుకుంటున్నావయ్యా. నువ్వు మంచి నటుడివి. నువ్వు నటనకి ప్రాధాన్యం ఇచ్చే క్యారెక్టర్స్ చేయాలి అంటూ నాకు సలహా ఇస్తుండేవారు. అంటే ఏం చేసేది అన్నయ్య ప్రజలు ఏం కోరుకుంటే, ప్రేక్షకులు ఏం కోరుకుంటే అందులో మనం ఇవ్వాలి కదా.. అవకాశం ఇవ్వాలి కదా.. అందులో మనం చెయ్యాలి కదా.. అంటుంటే, లేదయ్యా అంటుండేవారు. బహుశా నేను అప్పుడు రుద్రవీణ చెయ్యడం కానీ, ఆపద్భాంధవుడు చేయడం కానీ, స్వయంకృషి కానీ, ఆరాధన కానీ ఇలాంటి సినిమాలు చేశానంటే గనక బహుశా నా వెనకాల ఆయనిచ్చిన సలహాని అని అనుకుంటాను. బాలుగారు మన నుంచి దూరంగా వెళ్లిపోయారు అని నేననుకోను. ఆయన మన మనసులలో శాశ్వతంగా ఎప్పుడూ జీవించే ఉంటారు. ఈ గాలి ఉన్నంత వరకు ఆయన పాటలు ఉంటాయి.. ఆయన పాటలు ఉన్నంత వరకు ఆయన సజీవంగానే ఉంటారు. బాలుగారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అన్నయ్య WE MISS YOU, WE MISS YOU..! బాలు అమర్ రహే..! బాలు అమర్ రహే..!’’ అని గాన గంధర్వుడు బాలుకి చిరు నివాళులు అర్పించారు.