చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత స్ట్రయిట్ కథలు చెయ్యడంలో తడబాటు చూపిస్తున్నాడు. ఎక్కువగా రీమేక్స్‌ని నమ్ముకుని సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే కమ్ బ్యాక్ మూవీ తమిళ కత్తి రీమేక్ ఖైదీ నెంబర్ 150 గా చేసాడు. తర్వాత చరిత్రని టచ్ చేస్తూ సైరా నరసింహారెడ్డి స్ట్రయిట్ కథ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక కొరటాల శివతో ఆచార్య స్ట్రయిట్ కథతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదుంది. కరోనా చక్కబడితే షూటింగ్ మొదలెడతారు. అయితే చిరు ఈ లోపు ప్లాప్ డైరెక్టర్‌కి అవకాశాలిస్తూ రీమేక్ బాట పట్టాడు. సాహో డైరెక్టర్ సుజిత్‌తో మలయాళ లూసిఫర్ రీమేక్ మొదలెట్టాడు. సుజిత్ లూసిఫర్ తెలుగు స్క్రిప్ట్ కూడా రెడీ చేసాడనే టాక్ నడిచింది.
ఇంతలో లూసిఫర్ రీమేక్ నుండి సుజిత్ తప్పుకున్నాడన్నారు. చిరు - సుజిత్ మధ్యన క్లాష్ రావడంతో లూసిఫర్ నుండి సుజిత్ తప్పుకున్నాడని, అసలు లూసిఫర్ రీమేక్ ఆగిపోయినట్లే అన్నారు కూడా. మెగా కాంపౌండ్ నుండి క్లారిటీ లేదు.. అయితే తాజాగా సుజిత్ లూసిఫర్‌ని డీల్ చేయలేనని చేతులెత్తేసినట్టుగా చిరు చెప్పడం చూస్తే పాపం సుజిత్‌ని వాడుకుని వదిలేశారనిపిస్తుంది. సుజిత్ కొత్తగా పెళ్లి చేసుకుని లూసిఫర్ స్క్రిప్ట్ మీద మనసు లగ్నం చెయ్యలేకపోయాడని.. అందుకే అతనే కావాలని లూసిఫర్ రీమేక్ నుండి తప్పుకున్నాడని.. మేము తప్పుకోమనలేదని చిరు ఇచ్చిన క్లారిటీ చూస్తే సాహో లాంటి మూవీ చేసాక.. లూసిఫర్ రీమేక్ చెయ్యడం పెద్ద విషయం కాదు. అలాంటిది సాహో దర్శకుడు సుజిత్ లూసిఫర్ చేయలేనని చెప్పడం హాస్యాస్పదం అంటుంటే.. సుజిత్ చెప్పిన లూసిఫర్ తెలుగు స్క్రిప్ట్ చిరుకి ఎక్కని కారణంగానే సుజిత్‌ని పక్కనబెట్టారని అంటున్నారు.
మరి చిరు ఇలా సుజిత్ గురించి చెప్పడం చూస్తే ఇక స్టార్ హీరోలెవరు సుజిత్‌కి ఛాన్స్ ఇస్తారంటే డౌట్ కొట్టాల్సిందే. ఎందుకంటే రీమేక్ హ్యాండిల్ చేయలేనని చేతులెత్తేసిన దర్శకుడు పెద్ద భారీ బడ్జెట్ మూవీస్‌ని ఇంకేం హ్యాండిల్ చేస్తాడని వారు అనుకోవచ్చు. మరి చిరు లూసిఫర్ నుండి సుజిత్ ఎందుకు తప్పుకున్నాడని రివీల్ చెయ్యకుండా ఉంటే కుర్ర దర్శకుడిని గట్టెక్కించినవాడు అయ్యేవాడు. కానీ ఇప్పుడు సుజిత్ గురించి చెప్పి అతనికి అవకాశాలు రాకుండా చేసాడేమో అనిపించడం లేదూ.