అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా తర్వాత విజయ్ బాలీవుడ్ లో సినిమా చేయనున్నాడని వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులోనూ కాదు బాలీవుడ్ లోనూ మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు.
దాంతో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ చిత్రం చేయాలని బాలీవుడ్ నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అటు విజయ్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడు. అందువల్ల బాలీవుడ్ దర్శకులని రెగ్యులర్ కలుసుకుంటున్నాడట. తాజాగా విజయ్, బాలీవుడ్ సినిమాని ఒప్పుకున్నాడని వినిపిస్తుంది. సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుందట. బాలాకోట్ పై వైమానిక దాడి నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ప్రచారం జరుగుతోంది.
పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన అభినందన్ వర్థమాన్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడట. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఐతే ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ విజయ్ దేవరకొండ బాలీవుడ్ సినిమా చేయడం ఖాయం అని వినిపిస్తుంది.