బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్కీ డోనర్ నుండి మొదలుకుని ఆయన చేసిన విభిన్నమైన చిత్రాలు ఆయుష్మాన్ ఖురానాకి ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లోకి ఎంటరైన ఆయుష్మాన్ ఖురానా, అనతి కాలంలోనే మంచి మంచి విజయాలు దక్కించుకున్నాడు. బడాయి హో, ఆర్టికల్ 15, అంధాధున్ చిత్రాల ద్వారా బాలీవుడ్ స్టార్స్ సరసన చోటు దక్కించుకున్నాడు.
ఆయుష్మాన్ చిత్రాలు చూసుకుంటే చాలా విభిన్నంగా ఉంటాయి. ఏది చేసినా విలక్షణంగా వైవిధ్యంగా చేయడం అలవాటు. అందుకే టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 100మంది అత్యంత ప్రభావవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వందమందిలో ఇండియా నుండి కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకరు ప్రధానమంత్రి మోదీ కాగా, మరొకరు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా.
తనదైన నటనతో జాతీయ అవార్డుని గెలుచుకున్న నటుడు ప్రపంచం మీద ఎంతో ప్రభావం చూపుతున్నాడన్న టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆయుష్మాన్ ఖురానాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోదీ తర్వాత ఆయుష్మాన్ ఖురానా పేరు రావడం నిజంగా గొప్ప గౌరవం.