బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, హిట్టు సినిమా తీసి చాలా రోజులు అవుతుంది. గత చిత్రం జీరో బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది. వరుస ఫ్లాపులతో అభిమానులను నిరాశ పరుస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తర్వాతి చిత్రం ఒప్పుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. తాజాగా షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని వినిపించింది.
గత కొన్ని రోజులుగా ఈ కాంబినేషన్ పై చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో పట్టాలెక్కబోతుందని, సినిమా కథ ఇదేనంటూ ఊహాగానాలు బయటకి వస్తున్నాయి. వాటి ప్రకారం అట్లీ తన సెంటిమెంట్ ని షారుక్ తో కూడా రిపీట్ చేయనున్నాడని వినిపిస్తుంది. అట్లీ దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరో డ్యుయల్ రోల్ లో కనిపించడం తెలిసిందే. మొదటి సినిమా రాజా రాణి వదిలేస్తే ఆ తర్వాత విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమాల్లో హీరో డ్యుయల్ రోల్ లో కనిపించాడు.
ఈ సెంటిమెంటుని షారుక్ తో తెరకెక్కించే సినిమాలోనూ ఫాలో అవుతున్నాడట. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ ని డ్యుయల్ రోల్ చేయనున్నాడని సమాచారం. పోలీస్ ఆఫీసరుగా ఒక పాత్రలో కనిపిస్తే మరో పాత్రలో విభిన్నంగా కనిపించనున్నాడని అంటున్నారు. ఐతే ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న షారుక్ ఖాన్ కి అట్లీ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.