అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన నిశ్శబ్దం చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరి( ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవాళ్లే సుమా) మొబైల్ ఫోన్లలో నిశ్శబ్దం అందుబాటులో ఉండనుంది. ఖచ్చితంగా థియేటర్లలోనే వస్తామని చెప్పినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చేసేదేమీ లేక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
నేడు నిశ్శబ్దం ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. పెయింటింగ్ చుట్టూ తిరుగుతున్న కథగా అనిపిస్తుంది. ఐతే నిశ్శబ్దం సినిమా అమెజాన్ లో వస్తుందని తెలిసినప్పటి నుండి అందరిలో ఒకటే అనుమానం కలిగింది. ఈ సినిమా అయినా ఓటీటీలో విజేతగా నిలుస్తుందా లేదా అని.. ఇప్పటి వరకు రిలీజైన తెలుగు సినిమాలేవీ ఓటీటీలో పెద్దగా సందడి చేయలేదు.
వచ్చాయా, నడుస్తున్నాయా అన్నట్టుగానే ఉన్నాయి తప్ప ప్రేక్షకులని ఉర్రూతలూగించిన సినిమా ఒక్కటీ రాలేదు. బాహుబలి ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అనుష్క నటించిన సినిమా అయినా ఓటీటీలో విజయభేరి మోగిస్తుందేమో చూడాలి. మరి ఏ విషయం తేలాలంటే అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆగాల్సిందే.