కరోనా కారణంగా థియేటర్స్ బంద్ వలన కొన్ని సినిమాలు ఓటిటికి దారిపడుతుంటే.. చాలా సినిమాలు థియేటర్స్ ఓపెన్ అయ్యాకే మా సినిమాలు విడుదల అంటూ భీష్మించుకుని కూర్చుంటున్నారు. ఇక దసరాకి థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రేక్షకుల మీద నమ్మకం లేని చాలామంది దర్శకులు, హీరోలు సంక్రాంతి టార్గెట్ అంటున్నాయి. ఇప్పటికే నితిన్ రంగ్‌దేని సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్టర్ మీద పేరు వేశారు. మరి నితిన్ సంక్రాంతి వరకు ఆగినా ఆగొచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌కి 100 కాదు 1000 కోట్లు ఇస్తామన్నా మేము ఓటీటీకి ఇవ్వమని దిల్ రాజే చెబుతున్నాడట. అంటే వకీల్ సాబ్ కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యేలా ఉన్నాడు.
ఇక మరో భారీ పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2 కరోనా లేకపోతే ఈపాటికి విడుదలయ్యేది. కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా సంక్రాంతికే విడుదలయ్యే సూచనలు ఉన్నాయంటున్నారు. ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా సంక్రాంతి టార్గెట్ అంటుంటే మొదటి నుండి ఓటిటిని వ్యతిరేకిస్తున్న రామ్ రెడ్ మూవీ కూడా చివరికి సంక్రాంతే అనేలా ఉంది. ఇక నాగ చైతన్య లవ్ స్టోరీకి ఓటిటి ఆఫర్ వచ్చినా.. చైతు ఒప్పుకోవడం లేదట. మరి లవ్ స్టోరీ కూడా సంక్రాంతే అంటారేమో. ఇక ఈ ఏడాది థియేటర్స్‌లో సినిమాలు విడుదల చేసిన కనీసం పెట్టిన ఖర్చు కూడా రాదనుకుంటున్న హీరో రవితేజ క్రాక్ కూడా సంక్రాంతికి విడుదలవుతుంది అనే టాక్ ఉంది.
మరి వీటితో పాటుగా ఈ సంక్రాంతి బరిలో మరెన్ని తమిళ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు పోటీ ఇస్తాయో చూడాలి. ఏది ఏమైనా కరోనా కారణంగా అందరూ పర్ఫెక్ట్‌గా వేసుకున్న ప్లాన్స్ అన్ని అతలాకుతలం అయ్యాయి. మరి ఈ ఏడాది థియేటర్స్ తెరిచిన హీరోలెవరు తమ సినిమాలను విడుదల చేసే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. అందుకే అందరూ 2021 సంక్రాంతి మీద పడేలా కనబడుతుంది వ్యవహారం.