మీడియా తలచుకుంటే ఏమైనా చేయగలదు అని బాలీవుడ్‌లో రియా చక్రవర్తి కేసు విషయంలో చూశాం. మీడియా వలనే రియా చక్రవర్తి కేసు ఇంతగా హైలెట్ అయ్యింది. అయితే మీడియా చాలా విషయాల్లో శెభాష్ అనిపించుకుంటే కొన్ని విషయాల్లో మాత్రం కాస్త అతి చేస్తుంది అనేది కూడా రియా కేసు విషయంలోనే చూసాం. రియా చక్రవర్తి సుశాంత్ కేసు వలన ఎంత సఫర్ అయ్యిందో కానీ.. మీడియా వలన రియా సగం చచ్చిపోయింది. అసలు రియా చక్రవర్తి కనబడితే మీడియా చంపేసేలా కనబడింది వ్యవహారం. ఆమె కారు నుండి కాలు బయటపెట్టగానే మీడియా చుట్టుముట్టి చమట్లు పట్టించింది. మీడియా ఓవరాక్షన్‌ని అందరూ తప్పుబట్టారు. అలాగే రియాకి మీడియా నుండి పోలీసులు రక్షణ కల్పించాల్సిందిగా సుప్రీంకోర్టు చెప్పడం మీడియా ఎంతగా విచక్షణ కోల్పోయిందో అక్కడే అర్ధమవుతుంది. ఎలాంటి వాళ్ళయినా మీడియాకి దొరికారా? ఇక అంతే.
అందుకే ఇప్పుడు ఓ హీరోయిన్ మీడియాకి భయపడి సైలెంట్‌గా ఢిల్లీ హైకోర్టు నుండి తన మీద తప్పుడు వార్తలు రాకుండా చూడాలంటూ మొరపెట్టుకుంది. ఆమె రకుల్ ప్రీత్ సింగ్. సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారి సౌత్ హీరోయిన్ రకుల్ మెడకి చుట్టుకుంది. రియా, రకుల్ పేరు ఎన్సీబీ ముందు చెప్పడంతో.. మీడియా రకుల్ ఇంటిని చుట్టుముట్టడమే కాదు.. ఆమె షూటింగ్ చేసుకుంటున్న లొకేషన్‌కి వెళ్లి రకుల్‌ని ఇబ్బంది పెట్టాలని చూడడంతో రకుల్ ఏకంగా హైకోర్టుకి పోయింది.
తనని ఎవరు ఇబ్బంది పెట్టేలా మాట్లాడినా, తనపై అసత్య వార్తలు రాయకుండా, మీడియాలో తప్పుడు వార్తలు రాకుండా సమాచార శాఖకు ఆదేశాలివ్వాలని పిటిషన్ వేసింది. ఇక తనపై వస్తున్న తప్పుడు వార్తలు నిలిపివెయ్యాలని రకుల్ కోర్టుని కోరింది. మరి డ్రగ్స్ కేసులో రకుల్ ఎలాంటి స్పందన లేకుండా డైరెక్ట్‌గా కోర్టుకి వెళ్లడం చూస్తే రకుల్ మీడియాకి ఎంతగా భయపడిందో అర్ధమవుతుంది.