సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే విజయమే ప్రధానం. ఎంత టాలెంట్ ఉన్నా సక్సెస్ లేకపోతే అవకాశాలు రావు. అందుకే అందరూ సక్సెస్ కోసం పరితపిస్తుంటారు. ఐతే హీరో రాజ్ తరుణ్, గత కొన్ని రోజులుగా వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయమై, కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్తా మావా సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు.
ఆ తర్వాత సడెన్ గా ఫ్లాపుల బాట పట్టాడు. వరుస ఫ్లాపులు సతమతం చేస్తున్నాయి. మార్కెట్ బాగా తగ్గింది. ఈ విషయం గతేడాది విడుదలైన ఇద్దరి లోకం ఒకటే సినిమాతో క్లియర్ గా అర్థమైంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం విడుదలైందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ కి మాంచి హిట్ కావాలి.
ఐతే రాజ్ తరుణ్ చేసిన ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థియేటర్లు మూసి ఉన్న కారణంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా ద్వారా స్ట్రీమింగ్ అవనుంది. అక్టోబర్ 2వ తేదీ నుండి ఆహాలో అందుబాటులోకి రానున్న ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ కి సక్సెస్ తెచ్చిపెడుతుందా లేదా చూడాలి. థియేటర్లలో ఫ్లాపులు మూటగట్టుకున్న రాజ్ తరుణ్ కి ఓటీటీలో అయినా సక్సెస్ వస్తుందా అన్నది ఆసక్తిగా ఉంది. ఐతే ఆహాలో డైరెక్టుగా రిలీజ్ అయిన సినిమాలన్నింటికీ మంచి రెస్పాన్సే దక్కింది. మరి ఒరేయ్ బుజ్జిగా సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.