బిగ్ బాస్ మొదలై నాలుగు రోజులవుతుంది. మొదటి రోజు పరిచయాలు జరిగాయి. రెండవ రోజు నుండి ఆట మొదలైంది. ఐతే ఈ సారి బిగ్ బాస్ షోకి వచ్చిన కంటెస్టెంట్లలో చాలా మంది ఎవ్వరికీ తెలియనే తెలియదు. మొత్తం కొత్త మొహాలతో హౌస్ ని నింపేసారు. సింగర్ నోయల్, యాంకర్ లాస్య తప్ప మిగతా అందరూ అంతగా పాపులారిటీ లేని వాళ్లే. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు అందరూ ఫుటేజ్ కోసం తెగ ఆరాటపడిపోతున్నారేమో అనిపిస్తుంది.
వచ్చిన రెండవ రోజే ఏడుపులు, ఫ్యామిలీని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్.. ప్రేక్షకుల అటెన్షన్ ని తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలా అనిపిస్తుంది. ఐతే అందరూ ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు అనిపించడంతో బిగ్ బాస్ రియాలిటీ షో కాస్తా డ్రామా బాస్ గా తయారైంది. థియేటర్లలో సినిమాలు లేవు. బయట వాతావరణం బాగాలేదు.
ఇలాంటి టైమ్ లో మొదలైన బిగ్ బాస్, అసలైన ఎంటర్ టైన్ మెంట్ అందిస్తాడని అనుకుంటే సీరియళ్ళ కన్నా ఎక్కువ ఏడిపిస్తున్నాడు. ఈ మధ్య వస్తున్న సీరియళ్లలో కూడా ఇంత డ్రామా ఉండట్లేదు. తెలుగు బుల్లితెరపై రికార్డు టీఆర్పీలు సాధించే బిగ్ బాస్, ఏడుపులు, పెడబొబ్బల మధ్య కొనసాగితే అమాంతం కిందకి దిగిపోవడం ఖాయం అనిపిస్తోంది. మరి షో నిర్వాహకులు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.