ఆర్ ఎక్స్ 100 సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి, తన రెండవ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. మహాసముద్రం అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోంది. ఈ విషయమై నిన్న అధికారిక ప్రకటన వచ్చింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మహాసముద్రం తెరకెక్కుతోంది. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న అజయ్ భూపతి మహాసముద్రం పనుల్లో బిజీ అయిపోయాడు.
ఐతే సినిమా హీరో శర్వానంద్ అని కన్ఫర్మ్ అయిపోయింది. మరి హీరోయిన్ ఎవరా అనే విషయం ఆసక్తిగా మారింది. నిజానికి మహాసముద్రం సినిమాని నాగచైతన్య హీరోగా చేద్దామని అనుకున్నప్పుడు సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట. కానీ నాగచైతన్య ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉండడం వల్ల ఆ కాంబినేషన్ సెట్ అవలేదు. ప్రస్తుతం అజయ్ భూపతి సమంతని తీసుకుంటాడా లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం అజయ్ భూపతి సమంతని హీరోయిన్ గా తీసుకోవడం లేదని అంటున్నారు. శర్వానంద్, సమంత జంటగా నటించిన జాను చిత్రం బాక్సాఫీసు వద్ద తేలిపోవడమే దానికి కారణం అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. మరి మహసముద్రంలో హీరోయిన్ గా అజయ్ భూపతి ఎవరిని ఎంపిక చేస్తాడో తెలియాలంటే వచ్చే వారం దాకా ఆగాల్సిందే.