బాలీవుడ్ బ్యూటీ, వివాదాస్పద నటి కంగనా రనౌత్‌కు కేంద్ర హోం శాఖ ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను కల్పించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్వర్వులు సైతం జారీ చేసింది. అంటే.. ‘వై ప్లస్’ కేటగిరీ కింద ఆమెకు ఒక పర్సనల్ సెక్యూరిటీ అధికారితో పాటు మరో 10 మంది పోలీసులు భద్రతను కేంద్రం కల్పిస్తుంది. వీరిలో కమెండోలు కూడా ఉంటారు. ప్రాణాపాయం ఉన్న కంగనా ఇకపై బయటికెళ్లాలంటే భద్రతతోనే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో కంగనా ఉంది. ఈ నెల 9న ముంబైకి రానుంది. దీంతో ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ భద్రతపై కంగన స్పందిస్తూ.. తనకు భద్రతను కల్పించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపింది. ఒక మహిళను ఆయన గౌరవించారని.. ఏదైనా సమస్య పట్ల నిర్భయంగా గొంతుకను వినిపిస్తున్న వ్యక్తిని ఏ శక్తీ ఆపలేదనే విషయం దీని వల్ల అర్థమవుతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ కూడా ఆమె మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనో పురుష అహంకారి అని.. భారతీయ మహిళలపై ఇన్ని ఘోరాలు, అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమేనని ఆగ్రహించారు. తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని.. తనకంటే ముందు గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అని కంగానా ప్రశ్నించారు. తాను మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.
కాగా.. ముక్కుసూటితనంతో వ్యవహరించే కంగనా నిత్యం వివాదాల్లో మునిగితేలుతుంటుంది. మరీ ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాంతరం పెద్ద హడావుడే చేసింది. నెపోటిజం, డ్రగ్స్ ఇలా పలు విషయాలపై పెద్ద హడావుడే చేసింది. ఆమే చేసిన ఈ సంచలన వ్యాఖ్యలను అక్కడి సెలబ్రెటీలతో పాటు రాజకీయ నాయకులు సైతం తీవ్రంగా తప్పుబట్టారు. ఓ వైపు ట్వీట్స్... మరోవైపు మీడియా ముందుకొచ్చి ఈమె చేసిన వ్యాఖ్యలు ముంబై మొత్తం మార్మోగాయి. ఇలాంటి తరుణంలో కంగనాను ముంబైలో అడుగుపెట్టనివ్వమని శివసేన నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ముంబై కూడా భారత్ బార్డర్‌లోని పీవోకే మాదిరిగా తయారైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది.