మహానటుడు యన్టీఆర్, అంజలి దేవి నటించిన లవకుశ చిత్రం చూడని తెలుగువారు వుండరు. ఆ చిత్రంలో లవకుశులుగా అలరించిన బాల నటులు సుబ్రహ్మణ్యం, నాగరాజులు. ‘లవకుశ’ సీతారాములను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ సినిమా ఇప్పటికీ చెక్కుచెదరని ఒక అపురూప చిత్రం. అందులో లవ, కుశలుగా నటించిన ఇద్దరు పిల్లలు సినిమాకే హైలెట్‌గా నిలిచారు. వారి హావ భావాలు ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేశాయి. ఆ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆ ఇద్దరు పిల్లలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటారు. వారు పెరిగి పెద్దవారయినప్పటకీ లవ, కుశలుగానే అందరి చేత గుర్తింపు పొందారు. లవకుశ సినిమాలో లవుడుగా తన ముద్దు ముద్దు మాటలతో అందరిని అలరించిన బాలుడి పేరు నాగరాజు. అమ్మమీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండు కలగలిపిన పాత్ర లవుడుది.
నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఆ సినిమాలో రాముడి పాత్ర పోషించగా ఆయననే ఎదిరించి యుద్దం చేస్తారు మన లవకుశలు. ఆ సినిమా ద్వారా ఎందరినో ఆకట్టుకున్న నాగరాజు సోమవారం కన్నుమూశారు. 71 సంవత్సరాల నాగరాజుకు భార్య ముగ్గురు కుమార్తెలు వున్నారు. ముగ్గురికి వివాహం జరిగింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నాగరాజు మరణం పట్ల సినిమా పరిశ్రమకు చెందినవారు, ‘లవకుశ’ అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు తెలుగు తమిళం భాషల్లో 340కు పైగా చిత్రాల్లో నటించారు. యన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో సుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా తెలుగు టివి రచయితల సంఘం అధ్యక్షులు డి సురేష్ కుమార్, మరియు సంఘ సభ్యులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ తమ సంతాపాన్ని తెలియచేసారు.