యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సరసన ‘మన్మథుడు-2’లో నటించిన సంయుక్త హెగ్డేపై బెంగళేరులోని ఓ పార్కులో దాడి జరిగిన విషయం విదితమే. స్పోర్ట్స్ బ్రా వేసుకుని వర్కౌట్లు చేస్తోన్న ఆ భామపై కవితా రెడ్డి అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన కలకలం రేపుతోంది. అయితే ప్రస్తుత ఆధునిక భారతదేశంలో అమ్మాయిల వస్త్రధారణపై ఇప్పటికీ ఎంతో కొంత వ్యతిరేకత వస్తూనే ఉందని.. ఇలా బట్టలు వేసుకోవడమేంటి..? అని సంయుక్తపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. పార్కులోని కవితాకే అందరూ సపోర్టు చేశారు కూడా. అమ్మాయి అయ్యుండి నిండుగా బట్టలు వేసుకోకపోవడం.. అది కూడా పబ్లిక్ ప్లేస్ కదా.. అదేం సినిమా కాదు కదా అని తిట్ల దండకం మొదలెడుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా స్పందించింది.
మనం పని మనం చూస్కోవాలి!
ఓరి దేవుడా సామ్..! అంటూ ట్వీట్ ప్రారంభించిన కాజల్.. సైలెంట్‌గానే కౌంటర్ ఇచ్చింది. నిజంగా.. ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నానని.. కవితా రెడ్డి గారు మీ కోపానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవాలని ఒకింత సలహా ఇచ్చింది. కవితా ఫ్రస్ట్రేషన్, కోపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని.. వీటన్నింటినీ మించి అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్లకు తెలుసని చెప్పింది. అసలు ఎదుటివారి గురించి పట్టించుకోవడం మాని మన పని మనం చూసుకుంటే మంచిదని కాజల్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఇప్పటికే హీరోయిన్‌కు కవితా రెడ్డి క్షమాపణలు కూడా చెప్పింది. పార్కులో జరిగిన ఘటన దురదృష్టకరమని కూడా కవితా చెప్పారు. మరి ఈ వివాదం ఇప్పటితో ముగుస్తుందో లేకుంటే మరింత ముదురుతుందో అనేది తెలియాల్సి ఉంది.