బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేరు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్‌లో మార్మోగిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. కరోనా టైమ్‌లో విధించిన లాక్ డౌన్ మొదలుకుని ఇప్పటి వరకూ తనకు ఫలానా కష్టం ఉందని ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తే వెంటనే వాలిపోయి సాయం చేసేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన్ను ‘రియల్ హీరో’ అని అభిమానులు పిలుచుకుంటుకున్నారు. అయితే సోనూసూద్ గొప్పేమీ కాదని.. ఆయనకు మించినోళ్లు మనవాళ్లు (తెలుగు హీరోలు) అని ప్రముఖ రచయిత, నటుడు, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళీ చెబుతున్నారు. ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సగ భాగం సోనూసూద్ గురించే చర్చ జరిగింది. ఇంతకీ ఈ ఇంటర్వ్యూలో పోసాని ఏం చెప్పారు..? సోనూ కంటే తెలుగు హీరోలే బెటర్ అని ఎందుకన్నారు..? సోనూకు తెలుగులో అవకాశాలిస్తారా..? ఇవ్వరా..? సోనూ కంటే ఇదివరకే మనవాళ్లు చాలా సాయం చేశారని పోసాని అంటున్నారు. ఆయన చెప్పిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
మనోళ్లు కోట్లిచ్చారు..!
‘సోనూసూద్ ఇస్తే (సాయం చేస్తే) భారతదేశం మొత్తం బాగుపడిపోయిందేంటి?. సోనూసూద్ నిన్నకాక మొన్న వచ్చాడు..ఎప్పట్నుంచో మనవాళ్లు (తెలుగు సినీ ఇండస్ట్రీ వాళ్లు) సాయం చేస్తున్నారు. కాకపోతే మనవాళ్లు ఆయనలాగా పేపర్లలో కనిపించరు. ఇది వాస్తవం. హెల్ఫ్ చేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. మనవాళ్లు ఏమీ ఇవ్వలేదనడం కరెక్ట్ కాదు.. చాలా సార్లు చాలా మందే ఇచ్చారు. అల్లు అర్జున్ లాంటి వాళ్లు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్ బాబు లాంటి వాళ్లు కోట్లల్లో ఇచ్చారు. మన వాళ్లు అందరిలాగా బిల్డప్ ఇచ్చుకోరు. రూపాయి పెట్టి పెద్ద ప్రెస్‌మీట్ పెట్టి బిల్డప్ ఇచ్చుకుంటారు. నేను కూడా ఈ కరోనా టైమ్‌లో నాకు తోచినంత నేను చేశాను. అది నేను చెప్పుకోనులే కానీ సాయం తీసుకున్న వాళ్లకు మాత్రమే తెలుసు’ అని ఇంటర్వ్యూ వేదికగా పోసాని చెప్పారు.
సోనూకు అవకాశాలిస్తారా..!?
‘నేను గర్వంగా చెబుతున్నా.. సోనూసూద్ కంటే వెయ్యి రెట్లు బ్రాడ్ మైండెడ్ ఉన్న హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మనకు ఉన్నారు. ఆయనకు ప్రచారం వచ్చినంత మాత్రాన అవకాశాలు రావు.. ఇవ్వరు అనేది వాస్తవం కాదు. సోనూసూద్ ఇచ్చుకున్నాడంటే ఇచ్చుకున్నాడంతే.. ఆయనకు దేశం మీద ప్రేమ ఉందో.. ప్రజల మీద ఉందో.. లేకుంటే ఇంకేమైనా ఉందో తెలియదు. ఆయన కంటే ఎక్కువే మనవాళ్లకు (తెలుగోళ్లు) కూడా ప్రేమ ఉంది’ అని పోసాని చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే పోసాని మాత్రం సోనూ కంటే టాలీవుడే బెస్ట్ అని చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోసాని ఏ మాత్రం నోరు జారకుండా బ్యాలెన్స్‌గా మాట్లాడారని చెప్పుకోవచ్చు.