రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం.. ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. అప్పటి నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ చూడాలన్న ఆసక్తి బాగా పెరిగింది. కానీ కోవిడ్ కారణంగా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ షాట్స్ చిత్రీకరించనందున ఇంకా రిలీజ్ చేయలేదు.
ఐతే కరోనా వల్ల ఐదునెలలుగా షూటింగ్ జోలికి పోలేదు. మధ్యలో డెమో షూట్ ప్లాన్ చేసినప్పటికీ రిస్క్ ఎందుకన్న ఉద్దేశ్యంతో వద్దనుకున్నారు. ఐతే ప్రస్తుతం పరిస్థితి కొంచెం మెరుగుపడిందనే చెప్పాలి. కేసులు పెరుగుతున్నా కూడా భయం మాత్రం బాగా తగ్గింది. అందువల్ల సినిమా షూటింగులు ఒక్కొక్కటిగా రీస్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు మొదలవుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ విషయమై ఒకానొక అప్డేట్ బయటకి వచ్చింది. దసరా పండగ తర్వాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ రీస్టార్ట్ కానుందట. ఈ మేరకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో షూటింగ్ మొదలవుతుందట. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ మొదలెట్టనున్నారట. చూడాలి మరి ఏం జరగనుందో..!