రాంగ్ గోపాల్ వర్మ టైటిల్ సాంగ్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి అంకితం!!
జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి, పోస్టర్‌ను మరో మహిళాభ్యుదయవాది సంధ్య విడుదల చేయడం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఆడియోను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ మధుర ఆడియో ద్వారా ఈ పాట లభ్యం కానుంది. యువ సంగీత సంచలనం ‘ర్యాప్ షకీల్’ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించడంతోపాటు... ఈ పాటకు గాత్రం అందించగా... ‘రాంగ్ గోపాల్ వర్మ’ దర్శకనిర్మాత జర్నలిస్ట్ ప్రభు స్వయంగా ఈ పాటను రాయడం విశేషం. కాగా ఈ పాటను మెగాభిమానులకు, విశేషించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు దర్శకనిర్మాత ప్రభు అంకితం చేశారు. ఆడియో ఆవిష్కరణలో తమ్మారెడ్డి భరద్వాజ, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, జర్నలిస్ట్ ప్రభు, సంగీత దర్శకులు ర్యాప్ షకీల్ పాల్గొన్నారు.
సినిమా పాత్రికేయుడిగా సుదీర్ఘమైన అనుభవం కలిగి అందరికీ తలలో నాలుకలా ఉండే ప్రభు... ఎంతో ఆవేదనతో, ధర్మాగ్రహంతో.. ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ చేరువ కావాలని కోరుకుంటున్నట్లు తమ్మారెడ్డి-దామోదర్ ప్రసాద్ అన్నారు. తనకు అవకాశం ఇచ్చిన ప్రభుకి మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ షకీల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రం కోసం తాను రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా నీ ఖర్మ’ అనే పాట మధుర ఆడియో ద్వారా.. నాకు అత్యంత ఆత్మీయులైన తమ్మారెడ్డి భరద్వాజ-కె.ఎల్.దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉందని, ర్యాప్ షకీల్ మంచి ట్యూన్ ఇవ్వడంతోపాటు... తనదైన గానంతో పాటను రక్తి కట్టించాడని రచయిత-దర్శకనిర్మాత ప్రభు తెలిపారు. ఈ పాటను మెగాభిమానులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అంకితం చేస్తున్నానని, అందుకే... పవన్ పుట్టినరోజున ఈ పాటను విడుదల చేస్తున్నామని అన్నారు. పవన్ పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తూ విద్యుత్ షాక్ కు గురై మరణించిన ముగ్గురు పవన్ ఫ్యాన్స్ కు ఈ సందర్భంగా సంతాపం తెలిపిన ప్రభు... ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయంలో పావు వంతు... ఆ ముగ్గురు ఫ్యాన్స్ కుటుంబాలకు అందిస్తామని ప్రకటించారు.