నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో దూసుకువచ్చిన ఈ భామ, ఆ తర్వాత చేసిన చిత్రాల ద్వారా సరైన విజయం అందుకోలేకపోయింది. ఇస్మార్ట్ శంకర్ లో ఆమె పలికిన డైలాగులు, స్క్రీన్ ప్రెసెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాయి. ఆ సినిమా చూసిన వాళ్ళందరూ నభా నటేష్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. ఇస్మార్ట్ తర్వాత వచ్చిన డిస్కోరాజా బాక్సాఫీసు వద్ద తేలిపోయింది.
ఐతే ప్రస్తుతం నభా నటేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం సోలో బ్రతుకే సో బెటరు. సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని సుబ్బు అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. కరోనా లేకపోతే ఈ పాటికీ థియేటర్లో రిలీజై ఉండేది. ఇస్మార్ట్ సినిమాతో మెస్మరైజ్ చేసిన నభా, ఈ సినిమాతో మరోసారి కుర్రకారు మతిపోగొడుతుందని అనుకున్నారు.
కానీ థియేటర్లు తెరుచుకోనందున సోలో బ్రతుకే సో బెటరు చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలకి ప్రేక్షకుల నుండి సరైన రెస్పాన్స్ వచ్చినా కూడా స్టార్ స్టేటస్ రావడం కష్టమే. ఎందుకంటే థియేటర్ లో సినిమా విడుదలకి, ఓటీటీ విడుదలకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఆ తేడానే నభా నటేష్ స్టార్ ఆశలపై నీళ్ళు చల్లాయి. థియేటర్లో బొమ్మ ఆడినన్ని రోజులు సినిమా హవా ఉంటుంది. ఆ హవా నటీనటులకి బాగా ఉపయోగపడుతుంది.
ఓటీటీలో అలా కాదు. సినిమా చూడగానే మరో సినిమానో వెబ్ సిరీసో వచ్చేస్తుంది. అప్పుడు అంతా అటువైపు వెళ్తారు. కాబట్టి ఓటీటీ ద్వారా స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం కష్టమే..