ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న కార్తికేయ, ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా సరైన హిట్ అందుకోలేకపోయాడు. అటు హీరోగా సినిమాలు చేస్తూనే గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్ గా కనిపించాడు. ఐతే ఆ చిత్రం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. కార్తికేయ హీరోగా వచ్చిన 90ఎమ్ ఎల్ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఐతే ప్రస్తుతం అతడు చేస్తున్న సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్నాడు.
జీఏ 2 బ్యానర్ లో బన్నీవాసు నిర్మిస్తున్న చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయ హీరోగా చేస్తున్నాడు. కౌషిక్ పెగళ్ళపాటి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపిస్తుంది. ఐతే కరోనా వల్ల థియేటర్లు ఇంకా తెరుచుకోనందున చావు కబురు చల్లగా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చకచకా మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేసుకుని స్ట్రీమింగ్ వైపు వెళ్లాలని అనుకుంటున్నారట.
ఈ మేరకు కార్తికేయని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారట. కానీ కార్తికేయ తన సినిమా థియేటర్లోనే రిలీజ్ కావాలన్న ఉద్దేశ్యంతో స్పందించడం లేదని టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. అన్ లాక్ 4 లోకి వచ్చేసినప్పటికీ థియేటర్ల మీద ఆంక్షలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద హీరోలు సైతం ఓటీటీ వైపు చూస్తుంటే కార్తికేయ థియేటర్లపై ఆశలు పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగనుందో..!