సాహో తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుంది. పీరియాడిక్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ యూరప్ లో జరగాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరిగింది కూడా. కానీ సడెన్ గా కరోనా విలయతాండవం చేయడంతో యూరప్ నుండి ఇండియా వచ్చేసారు.
ఐతే కథా ప్రకారం సినిమా నేపథ్యం యూరప్ కాబట్టి, అక్కడి లోకేషన్లని ఇక్కడే సెట్ వేసి చిత్రీకరణ పూర్తి చేయాలని అనుకున్నారు. అనుకున్నట్టుగా ఇక్కడ హాస్పిటల్ సెట్ కూడా వేసారు. ఐతే ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలకి ఉండే రిస్ట్రిక్షన్స్ దాదాపుగా ఎత్తేసారు. అదీగాక కరోనా ఉధృతి యూరప్ లో నెమ్మదించినందున మళ్ళీ యూరప్ కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం చిత్రబృందం అదే పనిలో ఉందని అంటున్నారు. ఛార్టెడ్ ఫ్లైట్ లో చిత్ర యూనిట్ యూరప్ వెళ్ళనుందట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.