కరోనా కారణంగా ఐదునెలలుగా థియేటర్లు మూసి ఉన్నాయి. హఠాత్తుగా వచ్చి ఇంకా తిష్టవేసుకుని కూర్చున్న కరోనా, థియేటర్ల ఓపెనింగ్ కి అడ్డు పడుతుంది. ప్రస్తుతం అన్ లాక్ దశలో ఉన్నప్పటికీ, సెప్టెంబర్ నుండి పూర్తి అన్ లాక్ లోకి మారుతున్నామని ప్రకటించినప్పటికీ థియేటర్లని మాత్రం మూసే ఉంచుతున్నారు. దీనివల్ల థియేటర్ యాజమాన్యాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి.
థియేటర్లు లేకపోవడంతో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలని తమ వద్దనే ఉంచుకోలేక అయినకాడికి ఓటీటీకి అమ్మేస్తున్నారు. చిన్న సినిమాల నుండి స్టార్ట్ అయిన ఈ అమ్మకం ఇప్పుడు పెద్ద సినిమాల వరకి వెళ్ళింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే థియేటర్ మనుగడే కష్టమయ్యే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకున్న థియేటర్ యాజమాన్యాలు దేశవ్యాప్తంగా సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాయి.
#SupportMovieTheatres, #SaveCinemas అనే హ్యాష్ ట్యాగ్స్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. థియేటర్లో బొమ్మపడక ఇబ్బందులు వస్తున్నాయని, ఎలక్టిసిటీ బిల్లులు సైతం థియేటర్ మెయింటెనెన్స్ కి భారంగా మారిందని, అందువల్ల థియేటర్లో సినిమా చూడడానికి నిబంధనలని జారీచేస్తూ తొందరలో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ మేరకు ఈ ట్రెండ్ లో నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, దర్శకులు.. అందరూ పాల్గొంటున్నారు.