చిరు దృష్టికెళ్తుంది.. ‘ఆచార్య’ కథపై నేనే కోర్టుకెళ్తా: కొరటాల
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరన్న విషయం తెలిసిందే. సోషల్ ఇష్యూస్‌కు సంబంధించిన సినిమాలు తెరకెక్కించడమంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్.. అమితమైన మక్కువ కూడా. ఇప్పటి వరకూ ఈయన తెరకెక్కించిన సినిమాలన్నీ సోషల్ ఇష్యూస్‌కు సంబంధించినవే. మంచి సందేశమున్న సినిమాలతో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా కూడా 40 శాతానికి పైగానే చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. అయితే ఈ సినిమా కథ తనదేనని రాజేష్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘శ్రీమంతుడు’ కథ కూడా తనదేనని శరత్ చంద్ర అనే వ్యక్తి మరో కొత్త ఆరోపణలతో మీడియా ముందుకొచ్చాడు.
పెద్ద చర్చే జరిగింది..!?
ఇవాళ ఓ తెలుగు ప్రముఖ టీవీ చానెల్‌లో ‘ఆచార్య’కు కథకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఇంటర్వ్యూ నడిచింది. సుమారు గంటకు పైగా దీనిపై సుధీర్ఘంగా అటు ‘ఆచార్య’ కథ తనదేనని చెబుతున్న రాజేష్, ఇటు ‘శ్రీమంతుడు’ కథ తనదేనని చెబుతున్న శరత్ చంద్ర మధ్య పెద్ద చర్చే సాగింది. వీరిద్దరి ప్రశ్నలకు కొరటాల సమాధానాలు చెప్పాడు. కానీ ఒక్కో సందర్భంలో వారు వేసిన ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పాలో తెలియక తల పట్టుకున్నంత పనే చేశాడాయన. ఇలా ఇద్దరూ రౌండప్ చేసి మాట్లాడటంతో.. ‘బాబాయ్ మీ కథలు కాదురా నాయనా’ అన్నట్లుగా ఓ వైపు ఆవేశం.. ఆవేదనతో మాట్లాడినంత పనిచేశారాయన.
‘ఆచార్య’ కథ నాదే..!
‘నేను చూసిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథ రాశాను. నేను మైత్రీ మూవీస్‌కు ఈ కథ చెప్పాను. నా మీద అంత బడ్జెట్ పెట్టలేమని మైత్రీ మూవీస్ చెప్పింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి మొదట కథ వినిపించాను. నా కథనే కొరటాల శివగారు తీసుకున్నారు. మీ కో-డైరెక్టర్ ద్వారా ఆచార్య కథ తెలుసుకున్న తర్వాతే నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు అంటున్నట్లుగా నా కథ కాకపోతే వెల్ అండ్ గుడ్.. మీకు క్షమాపణలు కూడా చెబుతాను. మీరు సినిమా తీసిన తర్వాత అదే కథతో మళ్లీ నేను సినిమా ఎలా చేయగలను..?’ అని ఆచార్య కథ తనదే అంటున్న రాజేష్ చెప్పుకొచ్చారు. ఇందుకు స్పందించిన కొరటాల ఒకింత కౌంటరిచ్చే ప్రయత్నమే చేశారు.
కోర్టుకెళ్తా..!
‘నేను సినిమా తీస్తున్న కథ మీది కాదు. మీరు చెప్పిన కథ వేరు.. నేను చెప్పిన కథ వేరు. నా కథ చాలా రోజుల క్రితమే రిజిస్టర్ అయ్యింది.. నేను ఇప్పుడు కథ మార్చమంటే మార్చలేను. నా కథ రాజేష్ చెబుతున్న కథ అస్సలు కాదు. మీ కథతో మీరే సినిమా తీసుకోండి రాజేష్. సినిమా షూటింగ్ దశలో ఉండగా.. నేను కథను ఎలా రివీల్ చేస్తాను. ఆచార్య కథ మీరు (రాజేష్) చెబుతున్నది కాదు అని చెబుతున్నా.. మీరు పదే పదే ఇలా ఎందుకు వాదిస్తున్నారు. రాజేష్ అనే వ్యక్తి మీడియా ఫాల్స్ ఎలిగేషన్స్ చేశాడు. ఈ వ్యవహారంపై ఇతరులు కాదు.. నేనే కోర్టుకు వెళ్తాను. నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను అవసరమైతే కోర్టుకు వెళ్తాను. ఆన్ రికార్డ్‌గా మరోసారి చెబుతున్నాను.. ఈ కథ మీది కాదు.. మీ కథ వేరు.. నా కథ వేరు. నా కింద పనిచేసే మనిషి.. ఇతరులకు కథ ఎలా లీక్ చేస్తాడు..?. ప్రతి పెద్ద సినిమా మీద కేసులు ఉన్నాయి. సోషల్ ఇష్యూస్‌పై ఎవరికి తోచిన విధంగా వారు కథలు రాసుకుంటారు. ఆరోపణలు చేసే వారందరికీ నేను కథలు వినిపించుకుంటూ పోవాలా..?. శ్రీమంతుడు సినిమాపై కోర్టులో పదికేసులు ఉన్నాయి. నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా రాజేష్ అదే ఆరోపణలు చేస్తూపోతే.. నేను కోర్టుకు వెళ్తాను. ఈ వ్యవహారం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్తుంది. ఇది బ్లేమ్ గేమ్’ అని కొరటాల క్లారిటీ ఇచ్చుకున్నాడు.
అంతేకాదు.. ఈ క్రమంలో ‘శ్రీమంతుడు’ కథ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఆ కథ రాసింది తానేనని శరత్ చంద్ర అనే వ్యక్తి మీడియాకెక్కాడు. ఈ ఆరోపణలపై కూడా పై విధంగా కొరటాల స్పందించాడు. మొత్తానికి చూస్తే.. ఈ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. చిరు దృష్టికి వెళ్తే ఏం జరగబోతోంది..? కొరటాల కోర్టు మెట్లెక్కితే పరిస్థితేంటి..? ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.