కోవిడ్ లేకపోయుంటే ఈ ఏడాది బాక్సాఫీసు దద్దరిల్లిపోయేది. ఎన్నో సినిమాలు రిలీజ్ కి రెడీగా పెట్టుకుని వెండితెర మీద తమ బొమ్మ చూసుకోవాలని భావించాయి. కానీ అనుకోని ఉపద్రవం వచ్చి అన్ని సినిమాల రిలీజ్ లని ఆపేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నెలలు సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఇంకా ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. సో.. రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ ఒక్కొక్కటి ఓటీటీ వేదికగా వస్తున్నాయి.
ఓటీటీలో విడుదలైతే థియేటర్ అనుభవం మిస్ అవుతుంది. ఎంతైనా థియేటర్ లో బొమ్మ పడితే ఆ కిక్కే వేరు. ఈలలు, గోలలు.. వాటి మధ్య సినిమా చూడడం ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్.. ఆ ఎక్స్ పీరియన్స్ కోసమే అభిమానులు గోల చేస్తున్నారు. తాజాగా తమిళ హీరో ధనుష్ కొత్త చిత్రం జగమే తంత్రం విషయమై అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఒక్కొక్కటిగా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతుంటే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన జగమే తంత్రం కూడా థియేటర్ రిలీజ్ అవకుండా ప్రేక్షకుల ముందుకు రావచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా తమ హీరో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయొద్దంటూ, ఆలస్యమైన ఫర్వాలేదు గానీ థియేటర్లోనే విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. మరి అభిమానుల మాట పట్టించుకుని జగమే తంత్రం సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేస్తారా చూడాలి.