శివ సినిమాతో తెలుగు దశ దిశని మార్చివేసిన రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత క్షణ క్షణం, రంగీలా, కంపెనీ, సత్య సినిమాలతో టాప్ లోకి వెళ్ళిపోయాడు. ఐతే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు వర్మ నుండి వచ్చిన సినిమాలు మరీ నాసిరకంగా ఉంటున్నాయి. ఒకప్పుటి వర్మ అభిమానులకి కూడా ఆ సినిమాలు నచ్చట్లేదు. నిజ జీవితాల ఆధారంగా కథల్ని తయారు చేసుకుని, వివాదాల ద్వారా పబ్లిసిటీ తెచ్చుకుని జనాల మీదకి సినిమాలని వదులుతున్నాడు.
ఇతరుల వ్యక్తిగత జీవితాల మీద సినిమాలు తీస్తున్నాడని చెప్పి వర్మ మీద సైతం సినిమాలు రూపొందుతున్నాయి. అందులో పరాన్నజీవి విడుదలైంది కూడా. అది గాక మరో రెండు మూడు చిత్రాలు రూపొందుతున్నాయి. ఐతే అవన్నీ వర్మ మీద వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్నవే. తాజాగా వర్మ మీద మరో సినిమా స్టార్ట్ కాబోతుంది. ఇది విమర్శనాత్మకం కాదు. ఒక రకంగా ఆర్జీవీ బయోపిక్ అని చెప్పవచ్చు. రాము అనే టైటిల్ తో రూపొందనున్న ఈ బయోపిక్ మూడు భాగాలుగా ఉంటుందట.
ఈ సినిమాతో దొరసాయి తేజ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. రాము మొదటి భాగంలో వర్మ కాలేజీ వ్యవహారాలు, అప్పటి ప్రేమలు, శివ సినిమా ఎలా వచ్చిందీ, దానికోసం వర్మ ఏం చేసాడు వగైరా ఉంటాయట. రెండవ భాగంలో వర్మ బాలీవుడ్ ప్రయాణం, మూడవ భాగంలో వర్మ ఇప్పుటి పరిస్థితి గురించి చూపిస్తారట. ఈ మూడవ భాగంలో తన పాత్రలో తానే కనిపిస్తాడట.