మీడియాలో బాగా నలిగిన కథాంశాలని తీసుకుని సినిమాలుగా మార్చడం వర్మకి బాగా అలవాటు. నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తీస్తూ వివాదాలనే ప్రచార అస్త్రాలుగా మార్చి తన సినిమాకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ ని తీసుకువస్తుంటాడు. ఇప్పటి వరకూ అలాంటి సినిమాలు వర్మ నుండి చాలా వచ్చాయి. గత కొన్ని రోజులుగా అలాంటి సినిమాలే తీస్తున్నాడు. ఐతే తాజాగా వర్మకి నల్గొండ కోర్ట్ షాకిచ్చింది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఇష్యూని బేస్ చేసుకుని కథ రాసుకున్న వర్మ, మర్డర్ పేరుతో సినిమా తెరకెక్కించాడు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అమృత (ప్రణయ్ భార్య) కోర్టుకెళ్ళింది. తన అనుమతి లేకుండా పేర్లు, ఫోటోలు వాడుతూ సినిమా తీయడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టుని ఆశ్రయించింది.
అమృత తరపు వాదనలు విన్న కోర్టు రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాని ప్రస్తుతానికి ఆపేయాలని ఆదేశాలు జారీచేసింది. కేసు పూర్తిగా విచారణ జరిగే వరకూ సినిమాని రిలీజ్ చేయకూడదని స్పష్టం చేసింది. ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదల అయ్యాయి.