తమిళ నటుడు సూర్య తెలుగు వారికి కూడా సుపరిచితమే. గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన సూర్య, ఆ తర్వాత మెల్లగా ఇక్కడ కూడా మార్కె0ట్ ఏర్పర్చుకున్నాడు. సూర్య సినిమాలు వరుసగా తమిళంతో పాటు తెలుగులోనూ అనువాదమయ్యాయి. ఇక్కడ సూర్యకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఐతే గత కొన్ని రోజులుగా తెలుగులో సూర్య మార్కెట్ తగ్గుతూ వచ్చింది. గ్యాంగ్ సినిమా నుండి మొదలుకుని ఎన్జీకే, బందోబస్త్ చిత్రాలు ఫ్లాప్ గా నిలిచాయి.
బందోబస్త్ చిత్రానికి తమిళంలో మంచి ఆదరణ లభించినప్పటికీ తెలుగులో మినిమం వసూళ్ళు కూడా తెచ్చుకోలేకపోయింది. ఐతే తాజాగా సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా తెలుగులో మళ్ళీ మార్కెట్ క్రియేట్ చేస్తుందని భావించారు. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజజీవితం ఆధారంగా తెరకెక్కించారు. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
జీవీ ప్రకాష్ కుమార్ పాటలు కూడా యూట్యూబ్ లో ట్రెండింలోకి వెళ్లాయి. మొదటి నుండి ఈ సినిమాకి పాజిటివిటీ కనిపించింది. సూర్య ఈ సారి ఎలాగైనా హిట్ కొడతాడని అనుకున్నారు. కానీ ఆ ఆశలు ఇక లేవు. కరోనా కారణంగా ఆకాశం నీ హద్దురా చిత్రం ఒటీటీలో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. అక్టోబర్ 30వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవనుందట. సూర్య లాంటి పెద్ద స్టార్ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అవడం కొంత ఆశ్చర్యకరమే..