గత కొన్ని రోజులుగా నాని నటించిన వి చిత్రంపై అనేక కథనాలు వస్తున్నాయి. సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో ఆగిపోయింది. మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాక వి సినిమాని రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఐదు నెలలు గడుస్తున్నా కరోనా ఉధృతి తగ్గకపోవడం వల్ల థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఇప్పట్లో తెరుచుకుంటాయన్న ఆశ కూడా లేదు.
దాంతో వి సినిమా ఓటీటీలో వస్తుందంటూ వార్తలు వచ్చాయి. మొన్నటికి మొన్న అమెజాన్ ఈ చిత్రాన్ని 32 కోట్లకి కొనుక్కుందని అన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ వార్త నిజమే అని తెలుస్తుంది. ఇప్పటి వరకు చిత్రబృందం ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, తాజాగా నాని హింట్ ఇచ్చాడు. ఈ రోజు నాని విడుదల చేసిన వీడియోలో ఈ విధంగా మాట్లాడాడు.
ఇంట్లో సినిమా చూస్తున్న నాని, థియేటర్ ఇంటికి రాకపోయినా థియేటర్ ఎక్స్ పీరియన్స్ వచ్చేస్తోంది అని చెప్పాడు. రిలీజ్ రోజు సినిమా ఎలా ఉంటుందోనన్న ఎక్సయిట్ మెంట్, నెర్వస్ నెస్ మిస్ అవుతున్నామని, మీరు కూడా ( ప్రేక్షకులని ఉద్దేశిస్తూ) ఫస్ట్ డే, ఫస్ట్ షో మిస్ అవుతున్నారని అన్నాడు. ఆ తర్వాత వి సినిమా గురించి ప్రకటన రాబోతుందని, రేపు అదేంటో వెల్లడి చేస్తామని ముగించాడు. మొత్తానికి వి సినిమా గురించి కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ తీరబోతుందని అర్థం అవుతుంది.