ఓటిటిలు అంటే డిజిటల్ స్ట్రీమింగ్స్ వచ్చిన కొత్తల్లో.. చాలామంది నిర్మాతలు డిజిటల్ హక్కులను అమ్మేటప్పుడు ఓటిటి సంస్థలకు పలు కండిషన్స్ పెట్టేవారు. శాటిలైట్ హక్కులతో పోటీగా డిజిటల్ హక్కులను అమ్మినప్పటికీ... తమ సినిమా విడుదలైన ఇన్ని రోజులకే మీరు మీ ఓటిటి ద్వారా ప్రసారం చేయాలని నిబంధన పెట్టేవారు. చిన్న సినిమాలైతే 40 రోజులు, పెద్ద సినిమాలైతే 60 రోజుల తర్వాతే ప్రసారం చేయాలనే కండిషన్ మీదే డిజిటల్ హక్కులు అమ్మేవారు. అయితే ఓటిటీస్ వలన థియేటర్స్ మూత బడేలా ఉన్నాయని థియేటర్స్ యాజమాన్యాలు చేసిన గొడవకు నిర్మాతలు అలా చేసేవారు. ఓటిటీల హవా తగ్గించాలని ప్రొడ్యూసర్స్ గిల్ట్ కూడా ఏర్పడి చర్చలు చేసేవారు.
కానీ ఇప్పుడు తారుమారైంది. థియేటర్స్ మూతబడి ఓటిటి హవా బాగా మొదలైంది. సినిమాలే కాదు... వెబ్ సీరీస్‌లతోనూ ఓటిటీలు దూసుకుపోతున్నాయి. అందుకే చాలామంది నిర్మాతలు ఓటిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఇప్పటివరకు ఓటిటీలకు కండిషన్స్ పెట్టిన నిర్మాతలు.. ఓటిటీలతో ఒప్పందానికి దిగుతున్నారు. కొన్ని సినిమాల నిర్మాతలు ఓటిటీలకు సినిమాని అమ్మేస్తే.. కొంతమంది అన్ని లెక్కలేసుకుని ఓటిటి బాట పట్టడానికి రెడీ అవుతున్నారు. వి, నిశ్శబ్దం, ఉప్పెన, రెడ్ సినిమాలు థియేటర్స్ దిక్కులేక ఓటిటిలోనే విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు ఒత్తిడిలో విడుదలైనా మళ్లీ థియేటర్స్ తెరుచుకున్నాక థియేటర్స్‌లో కూడా విడుదల చేసుకునే ఒప్పందానికి నిర్మాతలు ఉన్నారట.
అందులో భాగంగానే ఓటిటీలకు ఈ రకమయిన ఒప్పందాన్ని పెడుతున్నారట. ఓటిటిలో ఎప్పుడు విడుదలైనా మళ్లీ థియేటర్స్‌లో సినిమాని విడుదల చేసుకునే అనుమతులు ఉంటాయి. అయితే చాలామంది ఓటిటీలలో సినిమాలు చూశాక మళ్లీ థియేటర్స్‌కి వెళ్లారు. కానీ బీసీ సెంటర్స్ వారికీ ఓటిటి పెద్దగా ఇంట్రెస్ట్ లేని పాయింట్. వాళ్ళకి థియేటర్స్‌లోనే సినిమాలు చూస్తే కిక్ ఉంటుంది. అందులోనూ చాలామందికి ఓటిటీల వ్యవహారాలు తెలియవు. ఆ రకంగా సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి కలెక్షన్స్ వస్తాయని నిర్మాతల నమ్మకం. అందుకే నిర్మాతలు ఇప్పుడు ఇటువంటి ఒప్పందంతోనే ఓటీటీలను సంప్రదిస్తున్నారు.