పెళ్లి వయసు దాటిపోయినా.. పెళ్లి ఊసెత్తకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటున్న ప్రభాస్ పెళ్లిపై ఫ్యాన్స్ ఆశలు అడియాసలయ్యేలాగే ఉన్నాయి. బాహుబలి అవనీయండి పెళ్లి చేసుకుంటాను అని తన పెదనాన్న కృష్ణంరాజుకు మాటిచ్చిన ప్రభాస్ సాహోతో మళ్ళీ పాన్ ఇండియా మూవీ అంటూ రెండేళ్లు సరిపుచ్చాడు. అయినా పెళ్లి ఊసు లేదు. అదిగో ప్రభాస్ పెళ్లి.. ఇదిగో ప్రభాస్ పెళ్లి అనడమే కానీ.. ప్రభాస్ మాత్రం పెళ్లిపై పెదవి విప్పలేదు. ఆఖరుకి ప్రభాస్ ఈడు ఉన్న రానా పెళ్లి కూడా అయ్యింది. నితిన్, నిఖిల్ ఇలా వరసగా హీరోలంతా పెళ్లి పీటలెక్కుతున్నారు. కానీ వయసైపోతున్న ప్రభాస్ మాత్రం పెళ్లి పేరెత్తడం లేదు.
సాహో తర్వాత అయినా ప్రభాస్ పెళ్లి ఉంటుంది అనుకుంటే రాధాకృష్ణతో రాధేశ్యామ్ అంటూ మరో రెండేళ్లు టైం తీసుకున్నాడు. తర్వాత నాగ్ అశ్విన్ తో మరో పాన్ ఇండియా మూవీకి కమిట్ అయ్యాడు. అది ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ఇప్పుడు ముచ్చటగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు. బాలీవుడ్ త్రయంతో అంటే టి సీరీస్ నిర్మాతలతో, బాలీవుడ్ దర్శకుడు ఓం రనౌత్ తో ప్రభాస్ తన 22 వ సినిమా ‘ఆదిపురుష్’ అంటూ అనౌన్స్ చేసాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆదిపురుష్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఓ ఎపిక్ డ్రామాగా గ్రాఫిక్స్ హంగులతో తెరకెక్కబోతున్నట్టుగా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తెలిపారు. మరి ఈ సినిమాకి ఎలా లేదన్నా మరో రెండేళ్ల సమయం పడుతుంది. మరి సినిమాలు సెట్స్ మీదుండగానే ప్రభాస్ పెళ్లి పీటలెక్కుతాడో.. లేదంటే రాధే శ్యామ్, నాగ్ అశ్విన్, ఈ ఆదిపురుష్ సినిమాలు కూడా పూర్తయ్యాక పెళ్లి అంటాడో అంటూ ప్రభాస్ ఫాన్స్‌తో పాటుగా ఆయన పెదనాన్న ఫ్యామిలీ కృష్ణంరాజు దంపతులు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి.