థియేటర్లు తెరుచుకోని కారణంగా సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే చాలా చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఓటీటీ రిలీజ్ జాబితాలోకి తాజా తెలుగు చిత్రం జోహార్ కూడా చేరింది. టీజర్ తో అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం ట్రైలర్ తో వచ్చింది. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ లో ఆసక్తిగల అంశాలు చాలానే ఉన్నాయి. నాలుగు కథల్లోని ఐదు జీవితాలకి కావాల్సిన ఒక నిర్ణయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ప్రేమ, లక్ష్యం, అవసరం, ఆరోగ్యం, వీటన్నింటినీ శాసించేది రాజకీయం.. తన స్వంత ప్రయోజనాల కోసమే ఎక్కువగా ఆలోచించే రాజకీయ నాయకుడు తన తండ్రి విగ్రహం కట్టించాలన్న ఉత్సాహంలో పేదరికాన్ని పట్టించుకోడు. రాష్ట్ర ప్రయోజనాలని తుంగలో తొక్కి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టయినా సరే భారీ విగ్రహాన్ని కట్టాలన్న ఆలోచనతో ఉన్న రాజకీయ నాయకుడిని ట్రైలర్ లో గమనించవచ్చు.
అంతరిక్షం నుండి చూస్తే విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయా సార్.. పేదరికం కనిపించదా వంటి డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తానికి టీజర్ ఆసాంతం ఆసక్తికరంగా ఉంది. ఐదు జీవితాలని ఒక నిర్ణయం ఏ విధంగా మార్చేస్తుందో సినిమా రిలీజ్ అయితేనే తెలుస్తుంది. ధర్మసూర్య పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ మర్ని నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నైనా గంగూలీ, ఎస్తేర్ అనిల్ ప్రధాన పాత్రలుగా కనిపిస్తున్నారు. సీనియర్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 14వ తేదీ నుండి జోహార్ ఆహాలో స్ట్రీమింగ్ అవనుంది.