బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న సినిమాలన్నీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలే. సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్దం.. ఇలా వరుసపెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలనే ఒప్పుకుంటుంది. అయితే నిశ్శబ్దం సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. అప్పటి నుండి ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు బయటకి వచ్చాయి. ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ఆ వార్తలని ఖండించిన చిత్ర నిర్మాత కోన వెంకట్ నిశ్శబ్దం సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేస్తామని, ఇండస్ట్రీలోకి ఎంతో కష్టపడి వచ్చామని, సినిమా థియేటర్లలో రిలీజైతేనే అందరికీ బాగుంటుందని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా ఇప్పట్లో తగ్గేలా కనబడట్లేదు. అన్ లాక్ దశలో ఉన్నా కూడా థియేటర్లు మాత్రం తెరుచుకునే అవకాశం కనిపించట్లేదు.
దీంతో నిశ్శబ్దం టీమ్ పునరాలోచనలో పడినట్లుంది. అందుకే నిశ్శబ్దం సినిమాని ఎక్కడ చూడాలనుకుంటున్నారని ఓటింగ్ పోల్ పెట్టారు. మొత్తం 18వేల మంది ఆ పోల్ లో పాల్గొనగా 56శాతం మంది ఓటీటీలో రిలీజ్ చేయాలని కోరారు. 29శాతం మాత్రమే థియేటర్లలో చూస్తామని అన్నారు. మిగతా శాతం ఎలా అయినా ఫర్లేదని ఓట్ చేసారు. మరి మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోని తీసుకుని నిశ్శబ్దం సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.