తమ హీరో పుట్టినరోజు వస్తుందంటే పదిరోజుల ముందునుండే సందడి స్టార్ట్ చేస్తున్న అభిమానులు, పుట్టినరోజున చేసే హంగామా ఎలాంటిదో అందరికీ తెలిసిందే. సామాజిక దూరం పాటించాలన్న నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలన్నీ సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు రకరకాలుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తునారు. తాజాగా మహేష్ అభిమానులు చేసిన పని నెట్టింట వైరల్ అయ్యింది.
పది, పన్నెండేళ్లలోపు పిల్లలందరూ కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఇంటర్వెల్ టైమ్ లో వచ్చే ఫైట్ సీన్ ని రీక్రియేట్ చేసారు. ఇందులో కనిపించిన వారందరూ చిన్నపిల్లలే. వారంతా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన ఫైట్ ని రీక్రియేట్ చేసి వావ్ అనిపించారు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ లో స్లో మోషన్ షాట్స్ హైలైట్ గా నిలిచాయి.
ఇసుక గాల్లో లేచే షాట్స్ ఇంకా బాగున్నాయి. అచ్చం సినిమా ఫైట్ చూస్తున్నామా అన్నంత ఫీల్ కలిగించారు. బ్యాగ్రౌండ్ లో మహేష్ డైలాగులు చెబుతుంటే దానికి పెదాలని కదుపుతూ మొత్తం సీన్ చేసారు. ఈ వీడియో చూసిన అనిల్ రావిపూడి ఆశ్చర్యపోయాడు. అలాగే ఇలాంటి సీన్లు చేసేముందు జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చాడు కూడా. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ అందించిన ఈ గిఫ్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.