సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రాన్ని కొరటాలతో చేస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ పై వచ్చిన పుకార్లన్నీ నిజమవడంతో అంతకుముందే బన్నీ ప్రకటించిన ఐకాన్ సినిమా చర్చల్లోకి వచ్చింది. సుకుమార్ తో సినిమా ప్లానింగ్ లో లేకముందే బన్నీ వేణు శ్రీరామ్ దర్శకుడితో ఐకాన్ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు.
బన్నీ అల వైకుంఠపురములో చిత్రీకరణలో ఉండగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం బాలీవుడ్ భామలని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి బన్నీ పాన్ ఇండియా ప్లానింగ్ ఐకాన్ సినిమాతోనే స్టార్ట్ అయ్యిందట. కానీ సడెన్ గా సుకుమార్ తో పుష్ప లైన్లోకి వచ్చేసరికి ఐకాన్ ని పక్కన పెట్టాడు. అటు పక్క దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తుండడంతో బన్నీ పుష్ప చిత్రం కంప్లీట్ అయ్యాక ఐకాన్ తెరకెక్కుతుందని అనుకున్నారు.
కానీ కొరటాల శివతో తన నెక్స్ట్ చిత్రం ప్రకటించేసరికి ఆ ఆశలు కూడా పోయాయి. అయితే ఐకాన్ చిత్రం వెండితెర మీదకి వస్తుందట. కానీ అందులో హీరోగా బన్నీ బదులు మరొకరిని తీసుకుంటారట. ఆ మరొకరి పేర్లలో ఇద్దరి హీరోల పేర్లు వినబడుతున్నాయి. రామ్ చరణ్, నాని.. వీరిద్దరిలో ఎవరో ఒకరితే ఐకాన్ చిత్రం తెరకెక్కుతుందని అంటున్నారు. దిల్ రాజు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మరి బన్నీ ఆపేసిన ఐకాన్ ఎవరి దగ్గరికెళ్తుందో చూడాలి.