Advertisementt

థియేట‌ర్‌లో సినిమా ఇచ్చే కిక్కే వేర‌ప్పా!

Fri 07th Aug 2020 04:01 AM
movie in theater,theater experience,feast for the eyes,corona,lock down,ott  థియేట‌ర్‌లో సినిమా ఇచ్చే కిక్కే వేర‌ప్పా!
movie in theater experience is still worth the effort థియేట‌ర్‌లో సినిమా ఇచ్చే కిక్కే వేర‌ప్పా!
Advertisement
Ads by CJ

క్యాలెండ‌ర్ మారి ఏడు నెల‌లు గ‌డిచిపోయాయి. ప్ర‌పంచ‌మంతా క‌రోనా దెబ్బ‌తో క‌కావిక‌ల‌మ‌వుతోంది. తెలుగునేల ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ ఏడు నెల‌ల్లో థియేట‌ర్ల‌లో సినిమాలు రిలీజ‌య్యింది మొద‌టి రెండున్న‌ర నెల‌ల కాలంలోనే. ఆ కాలంలో ప్ర‌జ‌ల నుంచి సొమ్ము బాగా వ‌సూలు చేయ‌గ‌లిగింది రెండంటే రెండు సినిమాలే. అవి.. ‘అల‌.. వైకుంఠ‌పుర‌ములో’, ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’. ఒక‌టి రూ. 150 కోట్ల‌కు పైగా వ‌సూలు చేస్తే, ఇంకొక‌టి రూ. 130 కోట్ల వరకు రాబ‌ట్ట‌గ‌లిగింది. మిగిలిన సినిమాల్లో ‘భీష్మ‌’, ‘హిట్’ సినిమాలు వాటి బ‌డ్జెట్‌, కొనుగోలు రేట్ల‌ను బ‌ట్టి స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌నిపించుకున్నాయి. ‘అశ్వ‌థ్థామ’ ఫ‌ర్వాలేద‌నిపించ‌గా, ‘ప‌లాస 1978’ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. అంతే..

టాప్ స్టార్స్‌లో ఇద్ద‌రంటే ఇద్ద‌రే (అల్లు అర్జున్‌, మ‌హేష్‌) ఈ ఏడాది ఆడియెన్స్‌ను అల‌రించ‌గ‌లిగారు. విజ‌య్ దేవ‌ర‌కొండ (వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌), స‌మంత (జాను), ర‌వితేజ (డిస్కో రాజా) వంటి స్టార్ల‌కు నిరాశే ఎదురైంది. చాలామందికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌మే రాలేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ (వ‌కీల్ సాబ్‌), వెంక‌టేశ్ (నార‌ప్ప‌), నాని (వి) వంటి స్టార్లు థియేట‌ర్లు ఓపెన్ అవ‌గానే ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రిద్దామ‌ని ఎదురు చూస్తున్నారు. మిగ‌తా స్టార్లెవ‌రూ ఈ ఏడాది వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

రెండేళ్ల క్రితం ‘అజ్ఞాత‌వాసి’ ఇచ్చిన చేదు జ్ఞాప‌కాన్ని ‘అల‌.. వైకుంఠ‌పుర‌ములో’ వంటి నాన్‌-బాహుబ‌లి2 రికార్డ్ మూవీతో తుడిపేసుకొని తీపి గురుతును అందుకున్నాడు త్రివిక్ర‌మ్‌. అలాగే గ‌త ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్‌ 2’, ఈ ఏడాది సంక్రాంతికి ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ హిట్ల‌తో అనిల్ రావిపూడి టాప్ లీగ్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి యూత్ ఐకాన్ న‌టించిన ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ డిజాస్ట‌ర్ అయిన తీరు మాత్రం సినిమా పెద్ద‌ల్ని క‌ల‌వ‌ర‌ప‌ర‌చింది. విజ‌య్ ఇమేజ్‌ను ఆ మూవీ కొంత డామేజ్ చేసింది కూడా.

అలాగే త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘96’ మూవీ రీమేక్‌.. అందునా ‘ఓ బేబీ’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సాధించిన స‌మంత టైటిల్ రోల్ చేసిన ‘జాను’ సినిమాని ఆడియెన్స్ తిర‌స్క‌రించిన తీరు కూడా బాధాక‌ర‌మే. క్లాసిక్ ఫిల్మ్ అవుతుంద‌నుకున్న ఆ మూవీ కాస్తా దారుణ ప‌రాభ‌వాన్ని చూడాల్సి వ‌చ్చింది. ఇక ర‌వితేజ ప‌రాజ‌య ప‌రంప‌ర ‘డిస్కో రాజా’ తోనూ కంటిన్యూ అవ‌డం బ్యాడ్ థింగ్‌. అందులోనూ ర‌వితేజ డ‌బుల్ రోల్ చేసిన సినిమా అది.

మార్చి నెల ద్వితీయార్ధం నుంచి ఇప్ప‌టి వరకు థియేట‌ర్లు మూత‌ప‌డి ఉండ‌టం, ఎప్ప‌డు తెరుచుకుంటాయో తెలీని అయోమ‌య స్థితి నెల‌కొని ఉండ‌టంతో టాలీవుడ్ ఏ స్థాయిలో న‌ష్ట‌పోయి ఉంటుందో ఊహాతీతం. థియేట‌ర్లు మూత‌ప‌డి ఉండ‌టం వ‌ల్ల వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. షూటింగ్‌లు పూర్త‌యి, విడుద‌ల‌కు సిద్ధంగా ప‌దుల సంఖ్య‌లో సినిమాలు ఉన్నాయి. అలాగే షూటింగ్ మ‌ధ్య‌లో మ‌రెన్నో సినిమాలున్నాయి. వీటిపై పెట్టిన పెట్టుబ‌డిపై వడ్డీ పెరిగిపోతూ నిర్మాత‌ల్లో తీవ్ర క‌ల‌వ‌రాన్ని క‌లిగిస్తోంది.

కొంత‌మంది ఈ టెన్ష‌న్ త‌ట్టుకోలేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అవి విడుద‌లైన రెండు మూడు రోజుల వ‌ర‌కే హంగామా ఉంటోంది. ఆ త‌ర్వాత వాటిని ప‌ట్టించుకున్న‌వాళ్లు క‌నిపించ‌డం లేదు. ఏదేమైనా థియేట‌ర్‌లో వంద‌ల మంది మ‌ధ్య‌లో పెద్ద తెర‌పై సినిమా చూసే ఎక్స్‌పీరియ‌న్సే వేరు. ఆ అనుభ‌వం ఓటీటీలోనో, ఏటీటీలోనో రాద‌నేది తేలిపోయింది. క‌రోనా వ్యాప్తి త‌గ్గి థియేట‌ర్లు తెరుచుకుంటే ఎప్పుడెప్పుడు త‌మ అభిమాన హీరోల సినిమాలు చూద్దామా, తెర‌పై వాళ్ల‌ను చూస్తూ ఈల‌లు వేస్తూ, చ‌ప్ప‌ట్లు కొడుతూ, డాన్సులు చేద్దామా అని ఫ్యాన్స్ క‌ళ్ల‌లో వత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆ రోజు వ‌స్తుంద‌ని ఆశిద్దాం.. థియేట‌ర్లు వ‌ర్థిల్లాలి.. పెద్ద తెర‌పై సినిమా అనుభ‌వ‌మూ వ‌ర్థిల్లాలి. దానికి ప్ర‌త్యామ్నాయం లేదు.

movie in theater experience is still worth the effort:

movie in theater experience is A Feast for the Eyes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ