తెలుగులో నితిన సరసన చేస్తున్న సినిమా తప్ప మరో సినిమాకి కమిట్ అవ్వని రకుల్ ప్రీత్, తాజాగా మరో సినిమాకి పచ్చాజెండా ఊపిందని అంటున్నారు. కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణం మల్లీశ్వరి బయోపిక్ లో రకుల్ ప్రీత్ ని మెయిన్ లీడ్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ బయోపిక్ కోసం చాలా మంది హీరోయిన్లని సంప్రదించారట. ముందుగా బాలీవుడ్ లో బిజీగా కొనసాగుతున్న తాప్సీ పన్నుని అడిగినట్టు సమాచారం.
అయితే తాప్సీ పన్ను బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం, ఇంకా ఈ బయోపిక్ కోసం శరీర ఆకృతిని కూడా మార్చుకోవాల్సిన కారణంగా ఇందులో నటించడానికి ఆసక్తి చూపించలేదట. ఇంకా ఇతర హీరోయిన్లని తీసుకోవాలని చూసినప్పటికీ వారందరిలో కంటే రకుల్ అయితే బాగుంటుందని భావించి కన్ఫర్మ్ చేసుకున్నారని సమాచారం. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగి వరుస హిట్లు అందుకున్న రకుల్, మన్మధుడు 2 తర్వాత సినిమాలేవీ ఒప్పుకోలేదు.
నితిన్ తో చేస్తున్న సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనబడట్లేదు. మరి కరణం మల్లీశ్వరి సినిమాతో అయినా తొందరగా తెలుగు తెరపై కనిపిస్తుందేమో చూడాలి. తెలుగు మహిళ అయిన కరణం మల్లీశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుని ఒలింపిక్స్ లో ఇండియా నుండి మొదటి పతకం గెలుచుకున్న మహిళగా గుర్తింపు పొందింది.