మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే అటు ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తూనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు.
కేవలం అతిథి పాత్రలా కాకుండా ఆచార్య సినిమాని మలుపు తిప్పే విధంగా రామ్ చరణ్ పాత్రని తీర్చిదిద్దారట. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు కాకుండా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయమై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. రామ్ చరణ్ తర్వాతి చిత్రం గురించి అనేక పుకార్లు వచ్చాయి. కానీ అధికారికంగా ఇంకా వెల్లడి చేయలేదు.
అటు ఎన్టీఆర్, బన్నీ తమ నెక్స్ట్ ప్రాజెక్టులని వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. హీరోలందరూ తాము చేయబోయే తర్వాతి ప్రాజెక్టులని అనౌన్స్ చేసుకుంటూ వెళ్తుంటే చరణ్ మాత్రం ఇంకా సస్పెన్సులోనే పెట్టాడు. వెంకీ కుడుముల, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి మొదలగు డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనేది కన్ఫర్మ్ కాలేదు. మరి రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో చూడాలి.