రీల్ లైఫ్ విలన్ రియల్ లైఫ్ హీరో. రీల్ లైఫ్‌లో జనాల్ని కష్టపెట్టే క్రూరుడు రియల్ లైఫ్‌లో జనాల కష్టాలు తీర్చే దేవుడు. ఈ కష్టకాలంలో సాయం అడిగిన ప్రతీవారికి నేనున్నానని భరోసా ఇస్తూ జనాల గుండెల్లో గుడికట్టుకున్న వ్యక్తి సోనూసూద్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే అందరూ చూశారు. కానీ.. కరోనా సందర్భంగా ఏర్పడ్డ తర్వాత ఆయన చేసిన మంచి పనులతో రీల్ లైఫ్ విలన్ కాస్త రియల్ హీరోగా మారిపోయారు. తనకు ఫలానా కష్టం ఉందని ఒక్క మాట చెబితే చాలు నిమిషాల్లో ఆ సమస్యను పరిష్కరించేసి వారి గుండెల్లో నిలిచిపోతున్నారు. ఆయన సినిమాల ద్వారా ఎంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడో తెలియదు కానీ.. ఈ మధ్య మాత్రం కోట్లాది మంది ఆయన ఫ్యాన్స్ అయిపోయారు. సోనూ ‘మానవుడి రూపంలో ఉన్న దేవుడు’ అని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇరకాటంలో పడతాడా..!?
ఇక అసలు విషయానికొస్తే.. ‘సోనూ రాజకీయాల్లోకి వస్తాడా?’, ‘ఏ పార్టీలో చేరతాడు..?’, ‘వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి?’, ‘సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా..?’, అసలు ‘ఈ రేంజ్‌లో సాయం చేయడం వెనుక ఏమైనా ముందస్తు ప్లాన్ అనేది ఉందా..?’.. ఇలా చాలా ప్రశ్నలే సోనూకు ఎదురవుతున్నాయి. అయితే ఆయన మాత్రం రాజకీయాల్లోకి వచ్చే సేవ చేయాలా..? నటుడిగా నేను చేయాల్సింది ఇంకా చాలా ఉందని.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెగేసి చెప్పేస్తున్నారు. వాస్తవానికి సోనూపై ఇంత పాజిటివ్ ఇమేజ్ అనేది అందరికీ సంతోషమిచ్చేదే.. సాయం చేయడంలో ఎలాంటి తప్పులేదు కానీ సినిమాల పరంగా సోనూను ఇరకాటంలో పడే అవకాశాలున్నాయని కొందరు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొదట సోనూకు సినిమా ఛాన్స్‌లు తగ్గిపోతాయట. అంతేకాదు ప్రస్తుతం ఆయన్ను దేవుడిగా కొలుస్తున్న కొందరు విలన్‌గా చూడటానికి ఇష్టపడరనే భావన దర్శక నిర్మాతల్లో ఎక్కువైపోయింది.
హీరోల్లోనూ భయం..!
ప్రస్తుతం హోల్ సినీ ఇండస్ట్రీల్లో ఏ హీరోకు రాని క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడాయన రియల్ హీరో. అలాంటిది రీల్ హీరోల చేత తన్నులు తినడం అంటే అభిమానులకు రుచించదేమో..!. హీరోలు కూడా ఆయన సరసన నటించేందుకు కాస్త అభద్రతగా భావిస్తారేమో. అంతేకాదు.. కలిసి నటించాల్సి వస్తే హీరోగా తమకు రావాల్సిన పేరంతా సోనూ ఖాతాలో పడుతుందనే భయం కూడా ఉంటుందట. ఇలా సినిమాల విషయంలో ఆయన ఇబ్బంది పడొచ్చు.
రాజకీయాల్లోకి వస్తే..!
సోనూ పొరపాటున చెప్పుడు మాటలు విని రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆయన్ను అస్సలు మసలనివ్వరు. ఆయన క్రేజ్, ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎంతసేపూ సోషల్ వర్కర్‌గానే తన పనులు తాను చేసుకుంటూ పోతే మంచిదని కొందరు సూచిస్తున్నారు. ఒక వేళ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఆయనపై రాళ్లేసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. అంతేకాదు.. ముందస్తు ప్లాన్‌గానే ‘సాయం’ అనే పేరుతో రాజకీయాల్లోకి వచ్చారని ఓ వర్గం ఆయనపై లేని పోని నిందలేయడం ఖాయం. సో.. అటు సినిమాల పరంగా, ఇటు రాజకీయాల పరంగానూ సోనూకు ఇరకాటమే. ఇలాంటి తలనొప్పుల నుంచి రియల్ హీరో ఎలా బయటపడతాడో వేచి చూడాల్సిందే.