పాపులర్ షో బిగ్‌బాస్ తెలుగులో విశేష ప్రేక్షకాదరణ పొందిందన్న విషయం విదితమే. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఆగస్టు చివర్లో షో ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఒకటికి వందసార్లు ఈ షో గురించి చర్చించిన యాజమాన్యం ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చిందట. గతేడాది మాదిరిగానే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ షోకు సెట్ సిద్ధమవుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ షోను నిర్వహించబోతున్నారట. ఇదివరకు జరిగిన మూడు ఎపిసోడ్‌ల మాదిరిగా టాస్క్‌లు ఉండవట. కొన్ని కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గతంలో మాదిరిగా 100 రోజులకు పైగా షో నడపకూడదని వీలైనంత త్వరగానే ముగించేయాలని యాజమాన్యం భావిస్తోందట. అంటే టాస్క్‌లతో పాటు రోజులు కూడా తగ్గిపోనున్నాయన్న మాట. వీటితో పాటు షోలో మార్పులు చేర్పులు చాలానే చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మార్పులు, చేర్పులివే..!
కొత్త మార్పులు చేర్పుల్లో ‘వైల్డ్ కార్డ్ ఎంట్రీ’ ద్వారా కంటెస్టెంట్లు ఉండరని టాక్ గట్టిగా నడుస్తోంది. మొదటి రోజు హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లే ఉండనున్నారు. కొత్త కండిషన్ల ప్రకారం కొత్త కంటెంస్టెంట్లు ఒక్కరు కూడా లోపలికి వెళ్లడానికి వీల్లేదన్న మాట. దీంతో మునుపటిలాగా కొత్త జోష్ అనేది మిస్సయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ అటుంచితే.. గత సీజన్ల మాదిరిగా కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు పడటాలు, కుల్లబొడుచుకోవటాలు, హగ్గులు, కిస్సులు, గుంపుగా చేరడానికి వీల్లేదట.
ఏవైనా చిన్నపాటి టాస్క్‌లే.. అవి కూడా భౌతిక దూరం పాటిస్తూ ఉంటాయట. మరీ ముఖ్యంగా గతంలో మాదిరిగా కాకుండా కంటెస్టెంట్ల సంఖ్య కూడా చాలా వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదివరకటి లాగా కాకుండా టాస్క్‌లన్నీ ఫిజికల్‌గా తలపడేలా కాకుండా మెంటల్‌గా తలపడేలా ఉంటాయని తెలుస్తోంది. ఇందుకు గాను కొందరు నిపుణులతో టాస్క్‌లు సిద్ధం చేశారట. మొత్తానికి చూస్తే.. గతంలో లాగా కాకుండా ఈ సీజన్‌ను మార్చేశారు. ఇలాంటి మార్పులు, చేర్పులతో షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో.. అసలు పైన చెప్పిన విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.