రీల్ లైఫ్ విలన్ రియల్ లైఫ్ హీరో. రీల్ లైఫ్‌లో జనాల్ని కష్టపెట్టే క్రూరుడు రియల్ లైఫ్‌లో జనాల కష్టాలు తీర్చే దేవుడు. ఈ కష్టకాలంలో సాయం అడిగిన ప్రతీవారికి నేనున్నానని భరోసా ఇస్తూ జనాల గుండెల్లో గుడికట్టుకున్న వ్యక్తి సోనూసూద్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే అందరూ చూశారు. కానీ.. కరోనా సందర్భంగా ఏర్పడ్డ తర్వాత ఆయన చేసిన మంచి పనులతో రీల్ లైఫ్ విలన్ కాస్త రియల్ హీరోగా మారిపోయారు. జులై-30 అనగా గురువారంతో ఆయన 47వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నెటిజన్లు, అభిమానులు అయితే ఆయన్ను ‘దైవం మనుష్య రూపేణా’ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. మరోవైపు ఆయన పేద ప్రజలకు, సాయం అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతుగా హెల్పింగ్ చేస్తున్న తీరును ప్రభుత్వం గుర్తించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ బర్త్ డే సందర్భంగా అందరిలాగానే.. టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కూడా విషెస్ చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఓ చిన్న రెక్వెస్ట్ పెట్టారు. ‘సోనూసూద్ చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించాలి. ఆయనకు ప్రభుత్వం పద్మభూషణ్ సిఫార్సు చేయాలి. సోనూ మహాత్మా’ అని ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు.. సోనుతో దిగిన పిక్‌ను షేర్ చేశాడు. ఈ పిక్‌కు ‘మేమే రాజా’ సోషల్ మీడియా గ్రూప్ క్రియేట్ చేసిన మరోదాన్ని జత చేశాడు. అందులో ఓ డైలాగ్ కూడా ఉంది.
బ్రహ్మాజీ-సోనూ మధ్య ఇలా సంభాషణ జరిగింది. బ్రహ్మాజీ ఇవాళ నా పుట్టిన రోజు కదా ఏం ప్లాన్ చేద్దాం చెప్పు అని సోనూ అడగ్గా.. ఇంకేముంది పార్టీ చేసుకుందాం అని బ్రహ్మాజీ బదులిచ్చినట్లుగా ఉంది. అయితే ఇందుకు సోనూ స్పందిస్తూ.. అక్కడ జనాలు అంత కష్టాల్లో ఉంటే నీకు పార్టీ కావాలా..? పార్టీ లేదు.. ఏం లేదు పద పోయి కొంత మందికి హెల్ప్ చేద్దాం అని ఆ పిక్‌లో ఉంది. సిచ్యేషన్‌కు తగ్గట్లుగానే ఆ పిక్‌లో ఫేస్‌లు కూడా ఉన్నాయి. ఇందుకు నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. గాంధీ ‘ఫాదర్ ఆఫ్ నేషన్’ అయితే సోనూ.. ‘బ్రదర్ ఆఫ్ నేషన్’ అని పొగిడేస్తున్నారు. మరోవైపు ఈ ట్వీట్‌కు సోనూ కూడా స్పందించారు. ‘బ్రహ్మా.. జీ నిన్ను చూడాలని ఉంది’ అని సోనూ రిప్లయ్ ఇచ్చారు.