కరోనా కాలంలో కూడా సినిమాలని రిలీజ్ చేస్తూ ఎంత పబ్లిసిటీ కావాలో అంతా తెచ్చుకుని ఎప్పుడూ మీడియాలో కనబడుతున్న రామ్ గోపాల్ వర్మ సరికొత్త సినిమా జోనర్ ని పరిచయం చేస్తున్నాడు. ఫిక్షనల్ రియాలిటీ పేరుతో వర్మ కనిపెట్టిన ఈ జోనర్ లో కల్పిత వాస్తవ కథల్ని సిద్ధం చేస్తున్నాడట. నిజానికి గత కొన్ని రోజులుగా వర్మ తీస్తున్నవన్నీ ఈ జోనర్ లో సినిమాలే అని చెప్పవచ్చు.
కానీ ఇంతకుముందు ఈ సృష్టికి సరైన పేరు లేదు. ప్రస్తుతం ఈ జోనర్ ని అధికారికంగా ప్రకటించాడు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ జోనర్ కనిపెట్టినట్లుగా చెప్పుకుంటున్నాడు. అయితే ఈ జోనర్ ద్వారా ఎవరిని టార్గెట్ చేయనున్నాడో తెలియదు గానీ, ప్రస్తుతానికి తన మీద తానే సినిమా తీసుకుంటున్నాడు. ఆర్జీవీ మిస్సింగ్ పేరుతో సినిమా ఐడియా ఎలా ఉంటుందనే విషయమై కథా పాయింట్ ని కూడా బయటపెట్టాడు.
తన ఐడియా ప్రకారం వివాదాల దర్శకుడు తప్పిపోయినట్లు వార్తలు వస్తాయట. పోలీసులు, ఇంకా ఇతర వర్గాల వారు ఆ మిస్సింగ్ ని పబ్లిసిటీ కోసమే వాడుకుంటున్నాడంటూ అంతగా సీరియస్ గా తీసుకోరట. కానీ నిజానికి సీరియస్ గానే ఆ దర్శకడు తప్పిపోతాడట. ఈ ఐడియాతో ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో మొదటి సినిమాగా ఆర్జీవీ మిస్సింగ్ ని రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే డజన్ల కొద్దీ సినిమాలని లైన్లో పెట్టిన వర్మ ఈ సరికొత్త జోనర్ లో ఎంత సక్సెస్ అవుతాడో చూడాలి.