ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన వెండితెర దృశ్యకావ్యం బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి వరకూ ఊహించడానికి కూడా భయపడే సాహసాన్ని తలెకెత్తుకున్న రాజమౌళి దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లూజన్.. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. అయితే బాహుబలి సినిమా రిలీజై ఏళ్ళు గడుస్తున్నా కూడా బాహుబలి ఇంపాక్ట్ మాత్రం తగ్గడం లేదు.
ఇప్పటికీ ఏదో ఒక రూపేణా బాహుబలి పేరు వినబడుతూనే ఉంది. బాహుబలి సినిమాలోని ప్రధాన పాత్ర శివగామి జీవితంపై ఒక పుస్తకం వెలువడిన సంగతి తెలిసిందే. ద రైజ్ ఆఫ్ శివగామి అనే టైటిల్ తో ఈ పుస్తకాన్ని ఆనంద్ నీలకంఠన్ రచించాడు. ఇందులో శివగామి రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చింది, తన కొడుకులను ఎలా పెంచుకుంటూ వచ్చిందీ అన్న విషయాలు ఉన్నాయి. బాహుబలి కథకి ముందు శివగామి రాజ్యపాలన ఎలా ఉందనే విషయమై ఇందులో వివరించాడు.
అయితే అంతటితో ఆ పుస్తకం పూర్తవలేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో పుస్తకం వచ్చింది. బాహుబలి కథకి ముందు ఏం జరిగిందన్న విషయమై మూడు పుస్తకాలు రాస్తానని ప్రకటించిన ఆనంద్ నీలకంఠన్, రెండవ పుస్తకాన్ని రిలీజ్ చేసాడు. చతురంగ అనే పేరుతో రాయబడిన ఈ పుస్తకం అమెజాన్ లో అందుబాటులో ఉంది.