అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ నుండి వచ్చిన పోస్టర్ అభిమానులకి కోపాన్ని కలిగించిందనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజగా ఒకానొక పోస్టర్ బయటకి వచ్చింది. ఆ పోస్టర్ లో అఖిల్ అక్కినేని కాఫీ తాగుతూ ల్యాప్ టాప్ లో తన పని తను చేసుకుంటూ కనిపిస్తున్నాడు.
అయితే పూజా హెగ్డే తన కాలివేళ్లతో అఖిల్ చెవిని తాకుతూ కనిపించింది. రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలాంటి పోస్టర్ ఉండటం సమంజసమే కావచ్చు కానీ అది మాత్రం అక్కినేని అభిమానులకి కోపం తెప్పించింది. నిర్మాతలు ఆ విషయాన్ని రొమాంటిక్ అనుకుని ఉండవచ్చు. కానీ అభిమానులు మాత్రం చిన్నతనంగా భావిస్తున్నారు.
పూజా హెగ్డేకి ఉన్న పాపులారిటీ కారణంగా ఇలాంటి పోస్టర్ ని రిలీజ్ చేసారేమో అన్న అనుమానాలు ఎదురవుతున్నాయి. గతంలో హీరోల పాదాలని తాకుతూ ఉండే పోస్టర్ల విషయంలో నిరసన ప్రదర్శించినవారు ఇప్పుడు ఏమీ మాట్లాడకపోవడంపై సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏదీ ఏమైనా భవిష్యత్తులో ఇంతకంటే మంచి పోస్టర్లని రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.