గత కొన్ని రోజులుగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ చేసిన సినిమాలన్నీ అంతగా ఆడలేదు. మొన్నటికి మొన్న డిస్కోరాజా సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. అయితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడట. ఈ సినిమా అనంతరం రవితేజ నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడని తెలిసిందే.
సినిమా చూపిస్తా మామ, హలో గురు ప్రేమకోసమే, నేను లోకల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన రవితేజ కోసం మంచి కథని రెడీ చేసాడట. కామెడీకి ప్రాధాన్యతని ఇస్తూ ఈ కథని తీర్చిదిద్దాడట. కిక్ సినిమాలో రవితేజ ఎంత ఎనర్జీగా కనిపించాడో అదే ఎనర్జీలో త్రినాథరావు సినిమాలో కనిపిస్తాడట. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.