ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన యంగ్ హీరో నిఖిల్, ప్రస్తుతం రెండు సినిమాలని చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమా ఒకటి కాగా, సుకుమార్ రాసిన కథతో తెరకెక్కుతున్న 18పేజెస్ కూడా మరొకటి. అయితే 18పేజెస్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారనేది ఆసక్తిగా మారింది. కథ, కథనాలను సుకుమార్ అందిస్తున్న ఈ సినిమాకి కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటించనుందని సమాచారం. వీరిద్దరూ గతంలోనే అర్జున్ సురవరం సినిమాలో జోడీగా కనిపించారు. అర్జున్ సురవరం బ్లాక్ బస్టర్ కాకపోయినా ఓ మోస్తారు హిట్ అనిపించుకుంది. అంతేకాదు ఈ సినిమాలో వీరిద్దరి జంటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల నిఖిల్ సరసన లావణ్య అయితే బాగుంటుందని భావిస్తున్నారట.
ఈ సినిమాలో హీరో మెమరీ లాస్ పేషంట్ గా కనిపిస్తాడట. మెమరీ లాస్ తో ఇబ్బందిపడుతూనే తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడనేది కథాంశంగా ఉండనుందని ప్రచారం జరుగుతోంది. అయితే సుకుమార్ కథ కావడంతో 18పేజెస్ చిత్రం మంచి రొమాంటిక్ లవ్ డ్రామాగానే కాకుండా థ్రిల్ కలుగజేసే అంశాలు ఉండనున్నాయట. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.